తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి ఫోన్‌ను పోలీసులు లాగేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్లు వేయ‌నీయ‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు అడ్డుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీన్ని నిర‌సిస్తూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్ర‌బాబు ఈరోజు చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. దీంతోపాటు ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికి హైద‌రాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఎయిర్ పోర్టులోనే బాబును అడ్డుకోవ‌డంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయించారు. చంద్రబాబు దగ్గరున్న మొబైల్‌ను పోలీసులు  బలవంతంగా లాక్కున్నారు. అంతేకాదు.. పీఏ, వైద్య అధికారితో పాటు ఆయన వెంట ఉన్న ఇతర నేతల ఫోన్లను కూడా బలవంతంగా పోలీసులు లాక్కోవడం గమనార్హం. అప్ప‌టికే ఎయిర్‌పోర్టులో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బ‌య‌ట తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వానికి, వైసీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఎయిర్ పోర్టు లోప‌ల టెన్ష‌న్ వాతార‌ణం నెల‌కొంది. చంద్ర‌బాబుతోపాటు ఆయ‌న ద‌గ్గ‌రున్న‌వారి ఫోన్ల‌ను కూడా పోలీసులు లాక్కున్నార‌నే స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎద్ద ఎత్తున రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అలా చేరుకునేవారిని దారిమ‌ధ్య‌లోనే పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు అక్క‌డ రాజ్య‌మేలుతున్నాయి.
ఎయిర్‌పోర్టులో అప్పటికే టెన్షన్ టెన్షన్‌గా ఉన్న పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని పోలీసులకు బాబు చెప్పారు.

చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌ను క‌ల‌వ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఉన్న‌తాధికారుల‌ను క‌లిసేందుకు మీకు అనుమ‌తి లేదంటూ పోలీసులు చెప్ప‌డంతో చంద్ర‌బాబు అక్క‌డే బైఠాయించిన విష‌యం తెలిసిందే. పోలీసుల‌తో చంద్ర‌బాబు వాద‌న‌కు దిగారు. అనుమ‌తిచ్చేవ‌ర‌కు త‌న నిర‌స‌న కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసుల తీరుపై బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ‘ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు నాకు లేదా..?’ అని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. ప్రస్తుతం విమానాశ్రయంలోనే చంద్రబాబు నిరసన కొనసాగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: