మన భారతీయ సంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టినరోజు ఆరు నెలల తరువాత అన్న ప్రసారణ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పుట్టిన బిడ్డకు మొట్ట మొదట సారిగా అన్నం తినిపించే కార్యక్రమమే అన్నప్రాశనం. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు. కొందరు పెద్దలు ఆరు నెలల తర్వాత చేయాలని సూచించగా మరికొందరు సంవత్సరం చివరన చేయాలనీ అంటారు. అలాగే  మరికొందరు మగ పిల్లలకు సరి నెలలు అంటే ఆరు లేదా ఎనిమిదవ నెలలో, ఆడపిల్లకి బేసి నెలల్లో అంటే ఐదవ లేదా ఏడవ నెలలో ఈ కార్యక్రమం జరిపించాలని అంటారు. ఇప్పటివరకు తల్లి పాలను మాత్రమే ఆహారంగా తీసుకున్న బిడ్డకు క్రమక్రమంగా ఇతర ఆహార పదార్థాలు పెట్టడమే దీని ఉద్దేశం .అయితే  శిశువుకు పెట్టే ఆహార పదార్థాలలో ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి .


ఇప్పుడు అన్నప్రాసన ఎలా చేయాలో తెలుసుకుందాం.. ఒక మంచి శుభ ముహుర్తాన దంపతులు ఆయురారోగ్యాల కొరకు సంకల్పం చెప్పుకుని గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపించి, శిశువు ,తల్లిదండ్రులు మంత్రపూర్వకంగా కంకణాలు ధరించాలి. శిశువును, ఆ తండ్రి, తన కుడి తొడపై కుర్చో పెట్టుకోవాలి . కొత్త బంగారు లేక వెండి పాత్ర ను, చెంచాను, తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో ఆవు పాలు, నెయ్యి, బెల్లం తో తయారైన పరమాన్నాన్నీ వుంచి, శిశువు మేనమామ మూడు సార్లు శిశువుకు నాకించాలి. మేనమామ లేకపోతే తల్లి తండ్రులే పెట్టవచ్చు.


ఆ తర్వాత  బిడ్డ తల్లిదండ్రులు కూడా కొద్దిగా రుచి చూపించాలి. తదుపరి ఆచార్యులు, బంధువులు బిడ్డకు తినిపించి ఆశీర్వచనాలు అందచేయాలి. తర్వాత ఒక చాప కానీ దుప్పటి కానీ వేసి  వివిధ రకాలైన వస్తువులు అంటే పుస్తకాలు, ధనం, బంగారం, వెండి, ఇతర పనిముట్లు, ఆహార పదార్థాలు తదితరాలను దేవుడి దగ్గర విడివిడిగా పెట్టి ఆ బిడ్డను వాటి ఎదురుగా వుంచాలి. వాటిలో ఏ వస్తువును ఆ శిశువు పాక్కుంటూ వెళ్లి ముట్టుకుంటాడో,  ఆ పనిలో ఆ బిడ్డ  నిపుణత సాధిస్తారని అర్థం చేసుకోవాలట. ఇలా మూడు సార్లు ఏ వస్తువులు పట్టుకుంటాడో చూడాలి. మన భారతీయులు బిడ్డకు చేసే మొదటి వేడుక ఇదే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: