ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. అనుమతి ఇచ్చిన గడువు ముగిసినందున దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలను కోరారు. అయినా ఆమె మాత్రం మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ప్రకటించింది. పోలీసుల ఒత్తిడితో దీక్ష విరమించిన షర్మిల.. ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ లోని తన నివాసం వరకు పాదయాత్ర వెళ్లడానికి సిద్దమైంది.

అయితే పాదయాత్రగా ఇంటికి వెళుతున్న షర్మిలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై షర్మిల మద్దతుదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. తోపులాటలో షర్మిల సృహ తప్పి పడిపోయారు. తర్వాత షర్మిల తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.    

అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నాచౌక్‌లో ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. అడ్డుగా ఉన్న కెమేరాలను తొలగించమంటూ మీడియాకు సూచించిన షర్మిల... అక్కడే ఉన్న సాక్షి ఛానెల్‌కు చురకలు వేశారు. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా... ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అయినా ఏమాత్రం తగ్గకుండా సాక్షి మీడియాను తనదైన శైలిలో షర్మిల ట్రీట్ చేశారు.

తన దీక్షలో కేసీఆస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు షర్మిల. కేసీఆర్‌ది గుండెనా.. బండరాయా? చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్‌కి కనిపించడం లేదా అంటూ ఘాటుగా విమర్శించారు యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్‌లో చలనం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని, అసలు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. యువతకు అండగా తాము పోరాటం చేస్తామన్నారు. షర్మిల దీక్షకు మద్దతుగా ఆమె అభిమానులు జిల్లాల్లో దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: