ఎన్నికల్లో విజయాలు అంటే జనాల మెదళ్ళలోకి ఎక్కాలి. 151 సీట్లతో బంపర్ విక్టరీని వైసీపీ నమోదు చేస్తే దేశమంతా అద్భుతం అన్నారు. దానికంటే ముందుకు వెళ్తే కడప లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ అయిదు లక్షల పై చిలుకు మెజారిటీని సాధించి అదుర్స్ అనిపించాడు.

అంటే జనాలు పదికాలాలు గుర్తు పెట్టుకునే విజయాలు అవి. ఇపుడు చూస్తే ఎన్నికల్లో అరకొర విజయాలే లభిస్తున్నాయి. వాటిని కూడా ట్విస్ట్ చేసి మరీ నైతిక విజయాలు అంటూ విపక్షాలు  మరో వాదన కూడా తెర ముందుకు తెస్తున్నారు. ఇక తిరుపతి ఉప‌ ఎన్నికల్లో వైసీపీకి క్యాట్ వాక్ అన్నారు.  ఎన్నికలు పెట్టడమే ఆలస్యం, అయిదారు లక్షల ఓట్ల మెజారిటీకి తగ్గకుండా ఎంపీ గెలుస్తారు అని కూడా భావించారు.

కానీ ఈ ఉప ఎన్నికను  ఊరకే  ఎందుకలా పోనిస్తారు. వైసీపీకి క్రెడిట్ టోటల్ గా  ఇచ్చేసి చేతులు ముడుచుకోవడానికి విపక్షం రెడీగా ఉంటుందా. అక్కడ ఉన్నది నాలుగు దశాబ్దాలుగా కాకలు తీరిన టీడీపీ. అందుకే దూకుడుగా ప్రచారం చేసింది. పోలింగ్ వేళ కూడా ఏం చేయాలో అన్నీ చేసింది. ముఖ్యంగా  తిరుపతిలో దొంగ ఓట్లు అంటూ టీడీపీ దాని అనుకూల మీడియా చేసిన యాగీకి వైసీపీ పరువు మొత్తం పోయింది. ఏ ఎన్నికలో అయినా దొంగ ఓట్లు ఎన్నో కొన్నో ఉంటాయి. అవి కూడా పోలింగ్ ముగుస్తుంది అనగా చివరి నిముషంలో జరుగుతాయి.

కానీ పోలింగ్ ప్రారంభం అయిన గంటకే టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అది రోజంతా కొనసాగించింది. నిజానికి దొంగ ఓట్లు ఆరోపణలు రాగానే ఎన్నికల అధికారులు అప్రమత్తం అవుతారు. అప్పటికి ఏవైనా జరిగినా కూడా చర్యలు తీసుకుంటారు. కానీ తిరుపతిలో మాత్రం టీడీపీ నేతలు ఇతర విపక్షాలు ఆఖరు దాకా అలా  యాగీ చేస్తూనే ఉన్నాయి. మరి ఎన్నికల సంఘం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అంటోంది.

దీన్ని బట్టి చూస్తే దొంగ ఓట్లు వేసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే వైసీపీ గెలవడం ఖాయం కానీ ఆ గెలుపు నలుపు అని టీడీపీ ఇపుడు పక్కాగా ప్రచారం చేసుకునే అవకాశం దక్కించుకుంది. దానికి అధికారుల వైఫల్యం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రేపటి రోజున వైసీపీ గెలిచినా ఓడినట్లే అని ముందే టీడీపీ ముద్ర వేశాక ఆ గెలుపు ఆనందం ఏముంటుంది. ఇదే వైసీపీ శిబిరంలో ఇపుడు సాగుతున్న చర్చట.



మరింత సమాచారం తెలుసుకోండి: