చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం...ఈ పేరు చెప్పగానే గుర్తుచ్చే పేరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదే. దశాబ్దాల పాటు కుప్పంలో చంద్రబాబు సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన బాబు తర్వాత టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 1989 నుంచి 2019 ఎన్నికల వరకు జరిగిన 7 ఎన్నికల్లో కుప్పంలో బాబుదే విజయం.


ఇక్కడ బాబు సామాజికవర్గానికి చెందిన కమ్మ ఓట్లు ఎక్కువ లేకపోయిన సరే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేకపోయారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కాస్త బాబుకు ఎదురుగాలి వీచింది. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాబుకు కుప్పంలో మెజారిటీ తగ్గింది గానీ, గెలుపు ఆగలేదు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్, కుప్పంలో బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


కుప్పంలో వైసీపీని బలోపేతం చేసే బాధ్యతని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా భరత్ ఉన్నా సరే, పెద్దిరెడ్డి డైరక్షన్‌లోనే రాజకీయం నడుస్తోంది. గత రెండేళ్లుగా కుప్పంలోని ప్రజలని తమ వైపుకు తిప్పుకునేందుకు పెద్దిరెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు కుప్పం ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. అసలు ఎక్కడా చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు.


ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సైతం కుప్పంలో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. దాదాపు 90 శాతం పంచాయితీలు వైసీపీనే కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యి, కుప్పంలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు చూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లోపు కుప్పంలో వైసీపీని స్ట్రాంగ్ చేసి, ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు. కానీ బాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ గెలుపు అంత సులువు కాదు. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పంచాయితీలు గెలిచారుగానీ, అదే బలం అనుకుంటే ఇబ్బందే. ఇక్కడ బాబుకు చెక్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. మరి అది నెక్స్ట్ ఎన్నికల్లో సాధ్యమవుతుందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: