కరోనా కారణంగా ఆగిపోతున్న కల్యాణాలు, శుభకార్యాలు. మన హిందువుల సంప్రదాయ కార్యక్రమాలకు కరోనా బ్రేక్ వేస్తోంది. మన హిందూ సంస్కృతి ప్రకారం వివాహం అనగానే ఎన్నో తంతులు ఉంటాయి. ఆ తర్వాత బంధుమిత్రుల మధ్య వివాహాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. అయితే ఈ మాయదారి వైరస్  మన సంప్రదాయాలను మార్చేస్తోంది. చాలామంది తమ వివాహాలను వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు వైరస్ భయంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంటి సభ్యుల మధ్యనే పెళ్లిని  కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు వెలవెలబోతున్నాయి. వేడుకలు లేక వాటి నిర్వాహకులకు ఆదాయం లేక ఆర్థిక భారం ఓ పెద్ద గుదిబండగా తయారయింది. 

ఇక లాకడౌన్ కారణంగా ఫంక్షన్ హాల్స్ అన్నీ పూర్తిగా మూతపడడంతో వీటిపై ఆధారపడి జీవిస్తున్న వారందరూ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతున్నారు. శుభకార్యాలపై ఆధారపడి జీవిస్తున్న క్యాటరింగ్, ఈవెంట్స్ నిర్వాహకులు, డెకరేషన్ చేసే వారు, పురోహితుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వైరస్ భయంతో ఒక్కరూ కూడా వీరిని ఇంటికి ఆహ్వానించడం లేదు. ఇలా శుభకార్యాలపై ఆధారపడి జీవనం కొనసాగించే వారు ఎంతో మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. కొందరు వేరే దారిలేక పండ్లు, కూరగాయలను విక్రయిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. మరికొందరు చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

ఇలా శుభకార్యాలపై కరోనా వేటు పడడంతో వాటిపై ఆదార పడి బ్రతుకుతున్న వారి జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఇకనైనా ఈ పరిస్థితి మారుతుందా, ఇంకా ఎన్నాళ్ళు కరోనా కారణంగా ప్రజలు జీవితాల్ని  గడపాలో తెలియడం లేదు. ఇది కాకుండా మళ్లీ కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం ఎక్కువవుతోంది. ఇంకెంతకాలం కరోనా కనంద హస్తాల్లో బందీలుగా ఉండాలో అని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడి మునుపటి జీవితం రావాలని, జనాలు స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలని అందరూ ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: