ఏపీలో మరోమారు రాజకీయ కాక రగులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనాతో కడప జిల్లా బద్వేల్ కి చెందిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించారు. ఆ సీటుకు ఉప ఎన్నిక తధ్యం. దానితో పాటుగా నర్సాపురం లోక్ సభకు కూడా ఉప ఎన్నిక జరుగుతుందా.

ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారా అంటే ఢిల్లీ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే ఏదో ఒక కీలక నిర్ణయం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకుంటారు అంటున్నారు. ఇప్పటిదాక వైసీపీ నుంచి అభ్యర్ధనలు స్పీకర్ కి వెళ్లినా కధ ఏమంతగా ముందుకు పోలేదు. కానీ జగన్ ఢిల్లీ టూర్ తరువాత సీన్ మొత్తం మారింది అంటున్నారు.

దాంతో సడెన్ గా రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు వెళ్ళి లోక్ సభ స్పీకర్ ని  కలవడం చర్చకు తావిస్తోంది. తన మీద అనర్హత వేటు పడదు అని ధీమాగా ఉన్న ఆయన మళ్ళీ స్పీకర్ ని తాజాగా  ఎందుకు కలిశారు అన్నదాని మీద  ఇపుడు అందరిలోనూ కొత్త డౌట్లు తీసుకువస్తున్నాయి. నిజానికి గత ఏడాది రఘురామ క్రిష్ణం రాజు మీద వైసీపీ ఫిర్యాదు చేసినా అప్పటి పరిస్థితులకు అది సీరియస్ అంశం కాదు.

కానీ ఈ ఏడాదిలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పైగా జగన్  బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేయడం అంటే అధినాయకత్వం మీద విశ్వాసం లేదని ప్రకటించడమే అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అదే విధంగా ఆయన ప్రభుత్వం తప్పొప్పులను మాత్రమే చెబుతున్నానని అనవచ్చు కాక, కానీ ఎవరూ బహిరంగంగా సొంత పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించరు. పోనీ ఒకటి రెండు సార్లు ఆవేశంతో చేస్తే సరే అనుకున్నా అలా కాకుండా ఒక సీరియల్ మాదిరిగా అప్పట్లో రఘురామ మీడియా సమావేశాలను పెట్టి వైసీపీని టార్గెట్ చేసేవారు. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అంటున్నారు.

ఇక ఆయన నియోజకవర్గం జోలికి ఈ మధ్యకాలంలో అసలు పోలేదు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఆయన దూరంగా ఉంటూ ఢిల్లీలోనే గడుపుతున్నారు. మరో వైపు ఆయన మీద ఏపీ సీఐడీ పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఇలా ఆయన వైసీపీతో పూర్తిగా విభేదించారని, ధిక్కరించారని ఆధారాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఆధారాలు చాలు ఆయన ఎంపీ పదవి పోవడానికి అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్  అంటున్నారు. వీటన్నిటి కంటే కూడా జగన్ ఢిల్లీ టూర్ చాలా బలంగా పనిచేస్తోందని కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ జత కలిసి స్పీకర్ కీలకమైన నిర్ణయం తీసుకుంటే కనుక నర్సాపురంలో ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.












మరింత సమాచారం తెలుసుకోండి: