కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఇంకా అర్ధం కావడంలేదు. తెలంగాణాకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌కి మంచి రోజులు వస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష ముంగిట్లోనే ఉంది. అదే హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక. ఇక్కడ కనుక కాంగ్రెస్ సత్తా చాటితే రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్‌లో ఎవరూ నోరెత్తే పరిస్థితి ఉండదు. కానీ నిజానికి అలా జరుగుతోందా అంటే లేదు అనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒకటి రెండు ఉదాహరణలు చూడాలిక్కడ.

పార్టీ తరఫున 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఈ మధ్యనే  వెళ్ళిపోయాడు. మరి ఆయనే అభ్యర్ధి ఒకనాడు. పైగా ఈట‌ల లాంటి బ‌ల‌మైన నేత‌ను ముందు నుంచి ఢీకొట్టే ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో 60 వేల ఓట్లు వరకు వ‌చ్చాయి. ఇపుడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఏ మాత్రం కాంగ్రెస్‌కి ఊపు ఉంటే కౌశిక్ ఎందుకు గోడ దూకుతాడు అన్న చర్చ అయితే ఆ పార్టీలో ఉంది. దీంతో పాటుగా చూస్తే బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఈయన కాంగ్రెస్ వైపు చూడలేదు. ఆయన్ని రావాలని కాంగ్రెస్ నేతలు కోరినా రాయబారాలు ఎన్ని నడిపినా పెద్దిరెడ్డి నుంచి నో రెస్పాన్స్ అంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ సీన్ ఏంటో తెలిసిపోతోంది అంటున్నారు.

ఇక ఈ రోజుకీ కాంగ్రెస్‌కి సరైన అభ్యర్ధి అక్కడ లేరు. మరో వైపు చూస్తే బీజేపీ తరఫున ఈటల రాజేందర్ జోరు కొనసాగుతుంది. నియోజకవర్గం అంతా కూడా ఆయన పాదయాత్ర చేస్తూ టీఆర్ఎస్‌కి దడ పుట్టిస్తున్నారు. ఇక ఈటలను ఎదుర్కోవడానికి అధికార టీఆర్ఎస్‌ కూడా అన్ని అస్త్రాలూ రెడీ చేసుకుంటోంది. కేసీఆర్ స్వయంగా దిగి మరీ ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు.

మరి రెండు పార్టీల మధ్యనే పోరు అన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికను ఇప్పటికే మార్చేశారు. మరి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ తరఫున ఎవరు అభ్యర్ధి అయినా మూడవ స్థానమే అంటున్నారు. పైగా ఆటలో అరడిపండు అయినా ఆశ్చర్యం లేదు అని కూడా విశ్లేషిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా అయ్యాక తొలి పరాభవాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సిందే అన్న మాట అయితే వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: