తెలంగాణ‌లో 2014 ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్ల మెజార్టీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అప్ప‌టి నుంచి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యి ఏడున్న‌రేళ్లు అవుతోంది. ఇప్ప‌ట‌కీ ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మాత్రం మాన‌లేదు. ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల‌ను స‌రైన టైం చూసుకుని మ‌రీ కారెక్కించేసుకుంటున్నారు. ఇక 2014 ఎన్నిక‌లు అలా ముగిశాయో లేదో వెంట‌నే  బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి , కోనేరు కోనప్పతో మొదలు పెట్టి..  ఆ త‌ర్వాత  టీడీపీలో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది ఎమ్మెల్యేల‌ను కూడా కారెక్కించేసుకున్నాడు. ఇక కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,  సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను గులాబీ గూటికి చేరిపోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో 88 సీట్లతో బంపర్ మెజార్టీ వచ్చినా కేసీఆర్ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ఆప‌లేరు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేల‌లో 12 మందిని లాగేసి.. ఏకంగా కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేసుకున్నారు. ప్ర‌భుత్వానికి స‌ర‌ప‌డా బ‌లం ఉన్నా కూడా ఇత‌ర పార్టీల‌ను పూర్తిగా నాశ‌నం చేసే క్ర‌మంలోనే కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేస్తున్నారంటూ రాజ‌కీయ మేథావుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కేసీఆర్‌కు బిగ్ స్ట్రోక్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఎప్పుడు అయితే టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి వ‌చ్చారో అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో రాజ‌కీయం మారుతోంది. ఇప్పుడు సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లుతోన్న నాయ‌కులే కాంగ్రెస్ గూటికి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు పుకార్లు వ‌స్తున్నాయి. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితేనేమి మొత్తం 40 మంది కీల‌క నేత‌లు.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి ట‌చ్‌లోకి వెళ్లార‌నే ప్రచారం జరుగుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కొంద‌రు... కొంద‌రు బెంగ‌ళూరులో క‌లిసి మంత‌నాలు సాగించిన‌ట్టు టాక్ ?

ఇటీవ‌ల కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ హ‌ఠాత్తుగా రెండు, మూడుసార్లు బెంగ‌ళూరు వెళ్ల‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఇక ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచే మొత్తం న‌లుగురు ఎమ్మెల్యేలు రేవంత్ ట‌చ్లో ఉన్న‌ట్టు టాక్ ?  వీరంతా గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే కావ‌డం విశేషం. ఏదేమైనా తెలంగాణ‌లో ఈ రెండేళ్ల‌లో ఎన్నో రాజ‌కీయ సంచ‌ల‌నాలు అయితే న‌మోదు కావ‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: