ఏపీలో ఉద్యోగులకూ, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. ప్రభుత్వోద్యోగులకు ఇటీవలి కొంతకాలంగా జీతాలు అందడం బాగా ఆలస్యం అవుతోంది. దీంతో పాటు అనేక ఉద్యోగుల డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంపై ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అయితే.. తమ సమస్యలను ఏకరవు పెడుతూ నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో వారు నేరుగా ప్రభుత్వ సలహాదారు సజ్జలతో నేరుగా మాట్లాడుతూ లైవ్‌లో దొరికిపోయారు.


ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి మీడియా బాగా హైలెట్ చేసింది. అయితే.. ఆంధ్రజ్యోతి ఎలాగూ జగన్ సర్కారుకు వ్యతిరేకం..  ఆ సంగతి తెలిసిందే.. అందుకే ఈ విషయాన్ని సజ్జల తాజాగా బాగా కవర్ చేశారు. ఉద్యోగ సంఘాలతో ఇవాళ చర్చించిన తర్వాత సజ్జల ఉద్యోగ సంఘాల నాయకులతో మీడియా ముందుకు వచ్చారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి మీడియాను పరోక్షంగా కామెంట్ చేశారు. ఉద్యోగులతో తాను మాట్లాడటంలో అభ్యంతరం ఏముందన్న సజ్జల.. అలా చర్చిస్తేనే కదా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ చెప్పుకొచ్చారు.


అంతే కాదు.. ఈ విషయాన్ని ఆ ఛానల్ ఏదో డిటెక్టివ్‌ లాగా కనిపెట్టినట్టు  కథనాలు రూపొందిస్తున్నారు. రహస్యంగా మట్లాడేది ఉంటే.. లైవ్‌లో ఉన్నప్పుడు మాట్లాడతారా అంటూ లాజిక్కు ప్రయోగించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27శాతం మధ్యంతర భృతి హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నెరవేర్చారని  సజ్జల గుర్తు చేశారు కూడా. రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్న సజ్జల... దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని వివరించారు.


ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని సజ్జల తెలిపారు. పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని సజ్జల వెల్లడించారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలను కూడా క్రమపద్ధతిలో చేస్తామని సజ్జల  భరోసా ఇచ్చారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదన్న సజ్జల.. అపోహలు వీడాల‌ని,  ఎవరేం చెప్పినా నమ్మొద్దని  ఉద్యోగులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: