ప‌ట్టాభి కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఆయ‌నేమో మాల్దీవుల‌కు వెళ్లిపోయాడు. కాదు వీళ్లే పంపించేశారు అని టాక్. ఏది ఎలా ఉన్నా జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు అన్న వేదాంతంలో టీడీపీ ఉంది. ఢిల్లీలో నిన్న చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తిని క‌లిసి త‌న గోడు చెప్పారు. అదేవిధంగా మీడియా ఎదుట కూడా వైసీపీ అరాచ‌కాల గురించి త‌న బాధేంటో తాను చెప్పారు. రాష్ట్రంలో అప్ర‌జాస్వామిక పాల‌న న‌డుస్తుంద‌ని కూడా చెప్పారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసే శ‌క్తి జ‌గ‌న్ కు మాత్ర‌మే ఉంద‌ని ఆరోపించారు. ఇదే సందర్భంలో పాల‌న ఏ విధంగా కుంటుప‌డుతోంది అన్నది కూడా వివ‌రించి వచ్చారు కానీ....

ఒక‌నాడు ఢిల్లీ కేంద్రంగా బాబు చ‌క్రం తిప్పారు. ఉమ్మ‌డి ఆంధ్రా సీఎంగానూ మంచి పేరు తెచ్చుకుని, ఢిల్లీ పాలిటిక్స్ పైనే స‌మాంత‌రంగా దృష్టి సారించేవారు. ఢిల్లీలో ఎర్ర‌న్న సాయంతో రాజ‌కీయాలు న‌డిపేవారు. ఆఖరికి ఇవాళ 3 ఎంపీల‌తో ఆయ‌న ఢిల్లీలో రాజ‌కీయాలు చేయాల్సి వ‌స్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్నో చేశాం అని చెప్పుకునే టీడీపీ నేత‌ల‌కు ఇదొక ఆశాభంగం. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్నో తెచ్చాం అని చెప్పేందుకు ఇక ఏమీ లేదు. రాష్ట్రం విడిపోయాక చంద్ర‌బాబు క‌ల‌లు హైద్రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ అయ్యాయి. అయినా కూడా అవేవీ రాణించ‌లేదు. తెలివిగా జ‌గ‌న్ డ్రామా ఆడాడు. గెలిచాడు. అప్ప‌టిదాకా మోడీతో లేని స్నేహాన్ని తెచ్చుకుని లేని ప్రేమ ను పెంచుకుని అధికారంలో వ‌చ్చాడు.

ఒక‌ప్పుడు నేష‌న‌ల్ మీడియాతోనే మాట్లాడుతాను అనేవాడు జ‌గ‌న్. ఇప్పుడు అస్స‌లు ఢిల్లీ వైపే పోవ‌డం లేదు. ఢిల్లీ వైపు వెళ్లినా కూడా బాబుకు ఆద‌ర‌ణ పెద్ద‌గా లేదు. చిన్న రాష్ట్రం అయిపోవ‌డం, నేత‌ల‌కు ప‌ట్టు లేక‌పోవ‌డం అన్న‌వి బీజేపీ ఎప్ప‌టి నుంచో గ‌మ‌ని స్తోంది. రేప‌టి వేళ టీడీపీ 25 ఎంపీ స్థానాలూ గెలుచుకుని వ‌చ్చినా కూడా బీజేపీ ప‌ట్టించుకునే స్థితిలో లేదు. అంతేకాకుండా ద‌క్షిణాదిలో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు టీడీపీ ద్వారా చేయాల‌ని అనుకున్నా అది కుదిరే ప‌ని కాదు అని కూడా తేలిపోయింది. నేరుగా ప్రాంతీయ పార్టీల‌నే న‌మ్ముకునే జ‌నంకు బీజేపీ అంటే న‌చ్చ‌దు. న‌ప్ప‌దు కూడా! ఈ ద‌శ‌లో గెలుపు ఎవ‌రిది? బాబుదా ? జ‌గ‌న్ దా ?  మోడీదా ? అప్ప‌ట్లో ఢిల్లీ ప‌రిణామాల‌పై టీడీపీ చూపిన శ్ర‌ద్ధ ఇప్పుడు చూప‌లేక‌పోతోంది. ఒక కొత్త కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చంద్ర‌బాబు కానీ కేసీఆర్ కానీ క‌ల‌లు కంటున్నారే కానీ అవేవీ నెర‌వేర‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు మాట నెగ్గ‌డం లేదు. కేసీఆర్ మాట కొంత నెగ్గిన విధంగా క‌నిపించినా అదంతా అవ‌స‌రాల్లో భాగ‌మే!


మరింత సమాచారం తెలుసుకోండి: