ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. 72ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు కూడా ఆయన్ను కాపాడలేకపోయారు. అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నారు.

కరోనాతో కన్నుమూసిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. 10భాషల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివశంకర్.. 800చిత్రాలకు పైగా డ్యాన్స్ కంపోజ్ చేశారు. 30చిత్రాల్లో నటించిన ఆయన.. మగధీర చిత్రానికి జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అమ్మోరు, ఖైదీ, సూర్యవంశం, అల్లరి పిడుగు, అరుంధతి, మహాత్మా, బాహుబలి 1సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

శివశంకర్ మాస్టర్ ఒక పాటను రెండు లేదా మూడు రోజుల్లోనే పూర్తి చేస్తారు. మగధీర సినిమాలో ధీరధీర పాట పూర్తి చేసేందుకు ఆయనకు 22రోజుల సమయం పట్టింది. రాజస్థాన్ లో కొంతభాగం తీయగా.. ఉప్పు మాత్రమే ఉండే మరో ప్రాంతంలో ఇంకొంత.. రామోజీ ఫిల్మ్ సిటీలో మిగతాది షూట్ చేశారు. చాలా శ్రద్ధగా చేసిన ఆ పాటకు మాస్టర్ జాతీయ అవార్డును అందుకున్నారు. అటు అరుంధతి సినిమాలోని భు భు భుజంగం అంటూ సాగే పాట కోసం మాస్టర్ 32రోజులు కష్టపడ్డారట.

శివశంకర్ మాస్టర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. తాను నటించిన అనేక చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఖైదీ సినిమాతో తమ మధ్య స్నేహం మొదలైందన్నారు. మాస్టర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుట్టు చెప్పారు చిరంజీవి. అటు శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరమని.. మగధీర సినిమా కోసం ఆయనతో పనిచేయడం మంచి అనుభూతి అని రాజమౌళి అన్నారు. మొత్తానికి శివశంకర్ మాస్టర్ మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: