తెలంగాణ మున్సిపల్,  ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై టీ-పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి  ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా పంచ్  విసిరారు.  నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలను  సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు .  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున  ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.  నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ధర్నాలకు దిగుతూ,  ఆందోళనలు చేపడుతున్నారు . స్థానిక ప్రజలకు వివిధ  ప్రజా సంఘాలు నేతలు  మద్దతుగా నిలుస్తున్నారు.


 రాష్ట్రంలోని  విపక్షాలు సైతం యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి.  నల్లమలలో యురేనియం  తవ్వకాలపై ప్రజాందోళనను  గ్రహించిన మంత్రి  కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాను ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.  కేటీఆర్ ట్వీట్ పై  రేవంత్ రెడ్డి స్పందిస్తూ  కేటీఆర్ గారు సురభి నాటకాలు కట్టిపెట్టండి ... యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి అంటూ సూటిగా నిలదీశారు . యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఇది ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుందని సినీ , రాజకీయ  ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .


 యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు , దర్శక, నిర్మాతలు గళం విప్పారు . సేవ్ నల్లమల ఉద్యమానికి  దర్శకుడు శేఖర్ కమ్ముల సపోర్ట్ చేయగా,  జనసేన అధ్యక్షుడు ,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలను నిరసించారు . ఇక  హీరో విజయ్ దేవరకొండ,  సాయి ధరంతేజ్,  యాంకర్ అనసూయ,  సినీ నటి సమంత , హీరో రామ్ సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: