
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మార్చి 1-5 తేదీల వరకు జరగనుంది. ఈ తరుణంలో జట్టు వైస్ కెప్టెన్ పోస్టు ఖాళీగా ఉంచారు. దీనికి ఎవరిని ఎంపిక చేస్తారోననే ఉత్కంఠ సాగుతోంది. కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. అయితే సబా కరీం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ స్థానానికి ఎప్పటికైనా సరైన వ్యక్తి పంత్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 'తదుపరి వైస్ కెప్టెన్‌ని ఎన్నుకునేటప్పుడు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. వయస్సు మొదలైనవి పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆ వ్యక్తి భారతదేశానికి భవిష్యత్తులో నాయకత్వం వహించాలి. ప్రస్తుతం, రవీంద్ర జడేజా మరియు రిషబ్ పంత్ ఇద్దరూ వైస్ కెప్టెన్ పోస్టుకు పోటీదారులుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కానీ జడేజా ఎంతో కాలం క్రికెట్ ఆడకపోవచ్చు. అతడికి పనిభారం కూడా కావొచ్చు. పంత్‌కు ఎదురైన ప్రమాదం తర్వాత మళ్లీ ఫిట్నెస్ సంతరించుకోవడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ఎదురుచూస్తోంది' అని తెలిపాడు.