పాకిస్తాన్ స్టార్ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. రెండు నెలలుగా విచారించిన‌ పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనికి చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను మాత్రం పీసీబీ వెల్లడించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్‌ 2.4.4 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ విడుద‌ల చేసిన‌ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫిబ్రవరిలో ఉమర్‌ అక్మల్‌ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు పీసీబీ పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ లేఖ‌లో పేర్కొంది. 

 

పాక్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో అతని అనుమ‌నాస్ప‌ద‌ ప్రవర్తనే నిషేధానికి కారణం కావొచ్చని ప‌లువురు క్రీడా విశ్లేష‌కులు భావిస్తున్నారు. 29 ఏళ్ల ఉమర్‌ అక్మల్‌ మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కమ్రాన్‌ అక్మల్‌కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు కూడా వరుసకు ఉమ‌ర్ అక్మ‌ల్‌ సోదరుడవుతాడు. ఉమర్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు. ఇక దీనిపై ఉమ‌ర్ అక్మ‌ల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మ‌రి.   

మరింత సమాచారం తెలుసుకోండి: