ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్ గురించి అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా.. ఇటలీ చేసిన అధ్య‌య‌నంలో క‌రోనాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. నిజానికి.. కరోనా వైరస్ వల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అయితే ఇట‌లీలోని నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఆదేశం నిపుణులు జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రామాణిక స్థాయిని మించిన ధూళి కణాలు సంవత్సరంలో వందరోజులకు మించి ఉండే నగరాల్లో కరోనా ప్ర‌మాదం మూడింతలు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ వెరోనా, స్టాన్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

 

అయితే.. ఈ అధ్యయనం ఇటలీకి మాత్రమే పరిమితమ‌ని వారు పేర్కొన్నారు. కాలుష్యానికి, కరోనా పాజిటివ్‌లు పెరగడానికి మధ్యగల సంబంధం ఏమిటో ఈ అధ్యయనం వెల్లడించలేదు. ఈ నిర్ధారణలు కేవలం సూచనమాత్రంగా ధోరణులను వివరిస్తాయి తప్ప వీటిని సాధారణీకరించలేమని ఆ నిపుణులు చెబుతున్నారు. మొత్తంమీద వాతావరణ కాలుష్యం అనేది ఏదోరకంగా కోవిడ్-19 వ్యాప్తికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్న‌ది ఇట‌లీ జ‌రిపిన‌ అధ్యయనం సారాంశం. దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: