తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మమతా బెనర్జీ వంటి నేతలతో ఫోన్‌లో మంతనాలు జరిపిన ఆయన నిన్న ముంబయి వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతోనూ భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ సమావేశం అయ్యారు. అయితే.. ఈ కేసీఆర్ పర్యటనలో నటుడు ప్రకాశ్ రాజ్ సీఎం వెంటే ఆద్యంతం ఉండటం విశేషం.


ప్రకాశ్‌ రాజ్‌ సినీరంగానికి చెందిన వారైనా.. రాజకీయాల పట్ల, సామాజిక సమస్యల పట్ల అవగాహన తపన ఉన్న నటుడు.. ఆయనకు కేసీఆర్, కేటీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్‌ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా ప్రకాశ్‌రాజ్‌ స్వయంగా ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిశారు.  అయితే నిన్నటి కేసీఆర్‌ పర్యటనలోప్రకాశ్‌రాజ్‌ పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి ముందుగా మీడియాకు ఇచ్చిన సమాచారంలోనూ.. నిర్ణయించిన పర్యటన షెడ్యూలులోనూ ప్రకాశ్ రాజ్ ప్రస్తావన ఎక్కడా లేదు.. కానీ.. ఆయన అనూహ్యంగా రావడంతో మీడియా ప్రతినిధులు కూడా షాకయ్యారు.


కేసీఆర్ ముంబయి పర్యటనలో ఆసాంతం ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. గతంలోనూ కేసీఆర్ వెంట ప్రకాశ్ రాజ్‌ అనేక సార్లు పర్యటనల్లో వెళ్లారు.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌ను తప్పకుండా  వెంట తీసుకెళ్తున్నారు. గతంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయినప్పుడు కూడా కేసీఆర్‌ తో పాటు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఉన్నారు. ప్రకాశ్ రాజ్ కన్నడ నటుడు అన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ భేటీలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర వహించారు.


ఇక త్వరలో కేసీఆర్ చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో నూ భేటీ కానున్నారు. అయితే.. ఈ పర్యటనలోనూ ప్రకాశ్‌రాజ్‌ పాల్గొంటారని తెలుస్తోంది. స్టాలిన్‌తో ప్రకాశ్ రాజ్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ పర్యటనలో ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ ప్రకాశ్‌ రాజ్‌ను ఇతర రాష్ట్రాల పర్యటనల కోసం వాడేసుకుంటున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: