లోపల ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ బయటకు వచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నవారికి మాత్రం మరీ ఇన్ని అబద్ధాలా అనిపించాయి. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న పవన్+నాదెండ్ల మనోహర్ తో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం భేటి అయిన విషయం తెలిసిందే. అర్జంటంటు సోమవారం సాయంత్రం పవన్ను ఢిల్లీకి పిలిపించుకున్న నడ్డా బుధవారం సాయంత్రం కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతోనే తెలిసిపోతోంది పవన్ కు కమలంపార్టీ అగ్రనేతలు ఇచ్చే విలువ ఏమిటో ? మరి సోమవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు ఢిల్లీలో పవన్ ఏమి చేశారనేది అత్యంత సీక్రెట్ వ్యవహారం. ఎందుకంటే దాదాపు 36 గంటల పాటు పవన్ ఏమి చేశారనేది ఎవరికీ తెలీదు కాబట్టి. సరే మొత్తానికి నడ్డాతో భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆణిముత్యాల్లాంటివి పవన్ నోటి నుండి ఆలవోకగా జారిపోయాయి.




ఇంతకీ పవన్ చెప్పిందేమిటంటే తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై తాను నడ్డాతో కలవలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించినట్లు చెప్పుకున్నారు. అమరావతి విషయం, పోలవరం వ్యవహారం లాంటివి తమ మధ్య చర్చకు వచ్చాయని జనసేనాని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఉపఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై ఓ కమిటి వేయబోతున్నట్లు నడ్డా చెప్పినట్లు పవన్ చెప్పారు. ముందేమో ఉపఎన్నిక గురించి చర్చించేందుకు రాలేదన్నారు. తర్వాతేమో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే విషయమై కమిటి వేయబోతున్నట్లు చెప్పారు. రెండింటిలో ఏది కరెక్టో మరి. సరే ఇతర విషయాలు చూస్తే ముందుగా అమరావతి తీసుకుందాం. రాష్ట్ర రాజధాని అంశం తమకు సంబంధం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా మూడుసార్లు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఇక నడ్డాతో పవన్ చర్చించేదేముంటుంది ? కేంద్రమే సంబంధం లేదని చెప్పిన అంశాన్ని నడ్డా మాట్లాడుతారా ? ఏమిటో చెబితే నమ్మేట్లుండాలి.




ఇక పోలవరం విషయాన్ని చూస్తే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటిఎంలాగ వాడుకున్నారంటూ స్వయంగా ప్రధానమంత్రే ఆరోపణలు చేసిన తర్వాత ఇక పవన్ కొత్తగా మాట్లాడేదేముంటుంది. పోలవరంలో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే దాన్నిపై కోర్టు స్టే ఇచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో కన్నా ఇపుడే పనులు చాలా జోరుగా సాగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా పవన్ మాట్లాడేదేమీ లేదు. దేవాలయాలపై దాడులు, మత పరమైన దాడుల విషయాన్ని తీసుకుంటే దీనికి నడ్డాతో చర్చించి ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశం. మొత్తానికి నడ్దాతో భేటిలో పవన్ మాట్లాడిన అంశాలేవి అనే విషయం కరెక్టుగా బయటకు వచ్చే అవకాశాలు లేవు. అందుకనే పవన్ చక్కగా ఓ కథ అల్లేసి నోటికొచ్చింది మీడియా ముందు చెప్పేశారు. అసలు విషయం బయటపడేంత వరకు పవన్ చెప్పింది నమ్మాల్సిందే ఏమి చేస్తాం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: