
వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ``కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక చేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి`` అని సీఎం కేసీఆర్ విశ్లేషించారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని పేర్కొన్న సీఎం కేసీఆర్ దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి సూచించారు. ``జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఎ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య`` అని వ్యాఖ్యానించారు. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్య రంగం తయారు కావాలన్నారు. దీనికోసం ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాలు రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.