బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు ఏపీలో ఈయన పేరు మారు మోగిపోతోంది. ఏపీలో అధికారం మారిన తర్వాత .. చంద్రబాబు సీఎంగా దిగిపోయి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. అమరావతి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు హయాంలో నిత్యం గ్రాఫిక్స్ కారణంగా.. సింగపూర్ డిజైన్ల కారణంగా అమరావతి హాట్ టాపిక్ అయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.


ఇప్పుడు అసలు రాజధానిగా అమరావతి ఉంటుందా.. ఉండదా అన్న టాపిక్ మీద అమరావతి హాట్ హాట్ టాపిక్ అయ్యింది. కృష్ణానదికి వరదలు వచ్చిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వరదలను దృష్టిలో ఉంచుకుని.. రాజధానిగా అమరావతి సేఫ్ కాదని.. దీన్ని కొనసాగించే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని బాంబు పేల్చారు.


బొత్స డైలాగ్ తో ఏపీ అటెన్షన్ మొత్తం రాజధానిపైకి వచ్చింది. తెలుగుదేశం నేతలు అంతా గగ్గోలు పెట్టారు. చివరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రాజధాని మారిస్తే ఊరుకోం అంటున్నారు. ఇదే విషయంపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ తన తాజా వ్యాసంలో అమరావతిపై కొత్త సర్కారు వైఖరుని తూర్పారబట్టారు.

ఆయన ఏం రాశారంటే..

“ ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో అసలు అమరావతి నిర్మాణం జరిగేనా? రాజధాని అక్కడే ఉంటుందా? అన్న సందేహాలు ప్రజల్లో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం కాదనీ, రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమనీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.


అంతటితో ఆగకుండా అమరావతి రాజధానికి అనువైంది కాదనీ, ముంపునకు గురవుతుందనీ ఒక పసలేని వాదనను తెరమీదకు తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదిరితే ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ ఆశపడ్డారు. అంతటి వ్యక్తి ఇవ్వాళ ఇంత సంకుచితంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదేళ్లకు పైగా మంత్రిగా ఉన్న బొత్స సొంత జిల్లా విజయనగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది... అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.


రాధాకృష్ణ విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా విజయనగరానికి నేనేం చేశానో చూపిస్తా రండి అంటూ సవాల్ విసిరారు.. రాధాకృష్ణ వస్తాడో లేక ఎవరిని పంపిస్తారో పంపండి’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. రాధాకృష్ణ కూడా మొండిఘటమే.. ఈ సవాల్ కు ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: