సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగా పదవుల్లోకి వచ్చిన వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. వరద బాధితులను సీఎం జగన్,  మంత్రులు పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. గాల్లో ప్రదక్షిణ చేసి జగన్ చేతులు దులుపుకున్నారు అని ఆయన మండిపడ్డారు. ఎక్కడికెళ్లినా మంత్రులను చుట్టుముట్టి  బాధిత ప్రజలు నిలదీస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

విపత్తుల్లో వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసింది అని విమర్శించారు. రూ 500 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది అని ఆయన అన్నారు. ‘ఇల్లు వారం రోజులు మునిగితేనే’’ నిత్యావసరాలు ఇస్తామని అనడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదని ఆయన పేర్కొన్నారు. ముంపు నష్టానికి, ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణం  అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం పనులు ఎందుకని రద్దు చేశారు..?  అని ఆయన నిలదీశారు. వాటిని రద్దు చేయకపోతే ఈ పాటికి పూర్తయ్యేది అని ఆయన తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడితే ప్రజల్లో అంత ఆదరణ పెరుగుతుంది అని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టిడిపి నూతన కమిటీలకు ఎంపికైనవారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ‘‘ కొత్త బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులను, కార్యకర్తలను సమన్వయం చేయాలని కోరారు. వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి కమిటీలు అండగా ఉండాలన్నారు. ఇవి పదవులు కాదు, బాధ్యతలుగా గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. ప్రజల పట్ల మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలని ఆయన వివరించారు. ఈ రోజు మనం చేసుకునే సంస్థాగత నిర్మాణంతో టిడిపి మరో 30ఏళ్లు ప్రజాదరణ పొందాలన్నారు. టిడిపి పోలిట్ బ్యూరోలో 60% బడుగు బలహీన వర్గాలకే..40% బిసిలకే టిడిపి పోలిట్ బ్యూరోలో సభ్యత్వం అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: