ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో సత్తాచాటాలని చూస్తోంది. చివరి వన్డే విక్టరీతో కోహ్లీసేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్ల రాక కూడా టీమిండియాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తొలి టీ20లో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు భారతజట్టు వ్యూహాలు రచిస్తోంది.

మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రెడీ అయింది. వన్డేలతో పోలిస్తే.. టీ20ల్లో టీమిండియా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గాయం కారణంగా వార్నర్‌ లేకపోవడంతో.. ఆస్ట్రేలియా జట్టు బలహీనపడింది. వన్డేలతో పోలిస్తే.. టీమిండియా టీ20 రికార్డు మెరుగ్గా ఉంది. ఈరెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన గత రెండు టీ20 సిరీస్‌ల్లో టీమిండియా గెలవలేదు. ఈ సారి ఆ రికార్డును మార్చాలని వ్యూహాలు రచిస్తోంది కోహ్లీసేన.

వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌ రాకతో బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారింది. చివరి వన్డేలో నటరాజన్‌..  యార్కర్లతో సత్తా చాటాడు. బుమ్రాతో పాటు షమీ, చాహర్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. వీరితో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, సుందర్‌, చాహల్‌తో బౌలింగ్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఓపెనర్‌గా రాణించిన కేఎల్‌ రాహుల్‌.. ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది.  విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండేలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఆ తర్వాత హార్దిక్‌, జడేజా వంటి ఆల్‌రౌండర్లు ఉండటం.. టీమిండియాను బలమైన జట్టుగా మారుస్తోంది.

ఆస్ట్రేలియా వన్డే, టీ20లకు ఒకే జట్టు ప్రకటించింది. ఇప్పటికే వార్నర్‌ సిరీస్‌కు దూరంగా కాగా.. ఆల్‌రౌండర్‌  స్టాయినిస్‌కు గాయం కావడంతో.. అతను తొలి మ్యాచ్‌ ఆడటం డౌటే. వీరిద్దరూ లేకపోయినా ఫించ్‌, స్మిత్‌, మాక్స్‌వెల్‌తో పాటు యువఆటగాళ్లతో ఆస్ట్రేలియా స్ట్రాంగ్‌గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: