ఏపీలో అధికార వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అదే పార్టీ తరుపున ఎంపీగా గెలిచి రఘురామ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. అయితే రాజుగారికి ఎక్కడికక్కడ చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇప్పటికే రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయినా రాజుగారు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తిరగబడుతూనే ఉన్నారు.

రాజద్రోహం కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన రఘురామ, ఢిల్లీ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. అలాగే జగన్ పలు హామీలని అమలు చేయలేదని వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఇక రఘురామ రాజకీయం మరీ ఎక్కువైపోవడంతో, ఆయన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. రఘురామ ఎంపీ పదవిపై స్పీకర్ వేటు వేసే విషయంలో క్లారిటీ లేదు. అందుకే రాజుగారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల లిస్ట్ నుంచి రఘురామకృష్ణంరాజు పేరు తొలగించారు. అలాగే రేపోమాపో రఘురామని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప అంటున్నారు. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రఘురామకే లైన్ క్లియర్ అయినట్లే. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తనని ఇండిపెండెంట్‌గా పరిగణించాలని స్పీకర్‌ని కోరతానని రఘురామ చెప్పేశారు. ఒకవేళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోయిన రఘురామ ఇండిపెండెంట్ ఎంపీగా ఉండిపోతారు. ఇక అప్పుడు మరింతగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడతారు. అంటే వచ్చే ఎన్నికల వరకు వైసీపీకి రఘురామ తలనొప్పి పోయేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: