ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలనుంచి అనూహ్య మద్దతు లభించింది. అయితే అభివృద్ధి పథకాల అమలులో మాత్రం ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనేమాట వాస్తవం. దీన్ని తొలగించేందుకు ఎన్నికలకు రెండేళ్ల ముందుగా సీఎం జగన్ సరికొత్త ప్రణాళిక రూపొందించారు. ముందుగా టిడ్కో ఇళ్ల విషయంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జగన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది.

టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం మొదలైంది. కానీ లబ్ధిదారులకు మాత్రం అవి ఇంకా అందని ద్రాక్షలానే ఉన్నాయి. ఓపక్క అపార్ట్ మెంట్లు పూర్తై రెండుసార్లు రంగులు పడ్డాయి, కానీ లబ్ధిదారులకు మాత్రం అవి అందలేదు. దీంతో ప్రజల్లో కొంత అసహనం ఉంది. దీన్ని వైసీపీ ప్రభుత్వం తొలగించబోతోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని తాజాగా అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. టిడ్కో ద్వారా 2 లక్షల 62 వేల ఇళ్లను మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నట్టు తెలిపారాయన. ఇప్పటికే లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మరో 63వేళ ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గత జనవరిలోనే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభమైనా ఇంకా నత్తనడకనే సాగుతోంది. అయితే ఈ పంపిణీని డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారాయన.

సరిగ్గా ఎన్నికల సమయానికి టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయితే లబ్ధిదారులంతా వైసీపీకి కృతజ్ఞతతో ఉంటారు. అదే ఊపులో జగన్ కి మరోసారి పట్టంకడతారనే ఆశ వైసీపీ నాయకుల్లో ఉంది. టిడ్కో ఇళ్లతోపాటు.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తైతే అది మరో అదనపు బలంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయితే.. జగనన్న కాలనీల్లో ఒక్క ఓటు కూడా పక్కకు పోయే అవకాశం లేదు. దీంతో ఎన్నికలనాటికి బలమైన ఓటు బ్యాంకుని వైసీపీ సాధించుకున్నట్టవుతుంది. ఓవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా జగన్ కి ఓటేస్తారనే నమ్మకం ఉంది. మరోవైపు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు, జగనన్న కాలనీల వల్ల లబ్ధిపొందినవారంతా వైసీపీ ప్రభుత్వానికి జై కొడితే.. రెండోసారి కూడా మెజార్టీ ఏమాత్రం తగ్గదని అధికార పార్టీ అంచనాలు వేస్తోంది. అందుకే ఎన్నికలనాటికి ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: