ఈ కాలంలో టీనేజీ అమ్మాయిలు తమ ఫిగర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏది తినాలన్నా గాని ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ లావైపోతామో ఎక్కడ ఫిగర్ పాడైపోతుందోనని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కానీ పెళ్లయ్యి, పిల్లలు ఉండి ఇళ్లలో ఉండే మహిళల సంగతేంటి.. వాళ్లకి ఫిట్ నెస్ అవసరం లేదా... అనే విషయాన్ని చాలామంది గృహిణులు ఆలోచించరు. కాస్త శరీరం మీద కేర్ తీసుకోవచ్చు కదా అంటే... ఎక్కడ కుదురుతుంది ఒకపక్క పిల్లలు, మరొపక్క ఇంటి పని అనేస్తారు సింపుల్ గా. అందంగా తయారయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. నిజానికి కేర్ తీసుకోమనేది అందం కోసం కాదు... ఆరోగ్యం కోసం. అవును. ఫిట్ నెస్ అనేది ఫిగర్ ని పర్ ఫెక్ట్ గా ఉంచుకోవడం కోసమే కాదు..ఆరోగ్యానికి కూడా అవసరం.  ఈ విషయం అర్థం కాని ఎంతోమంది గృహిణులు తమ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు.ఆకర్షణ కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు.నిజానికి ఫిట్ గా ఉండటానికి పని గట్టుకుని జిమ్ లకి వెళ్లక్కర్లేదు. పనులన్నీ మానేసుకుని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లోనే చక్కని వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.  కొద్దిపాటి జాగ్రత్తలతోనే అందాన్ని కాపాడుకోవచ్చు తెలుసా..





ముందుగా మీరు ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టండి. పనుల హడావుడిలో పడి ఏదో తినేశాంలే అనిపించకుండా ఓ క్రమ పద్ధతిలో తినడం అలవర్చుకోండి. మూడు నాలుగు గంటలకోసారి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకూ ఆహారంలో గింజలు ఉండేలా చూసుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెర తక్కవగా ఉండాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. మసాలాలు, కారం, నూనె తగ్గించేయండి.అలాగే ఎక్కువ నూనె పదార్ధాలు,   ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినడం మానెయ్యండి.




ఇక వ్యాయామం సంగతి చూస్తే మీరు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేలా చూసుకోండి.ఎంతసేపు శరీరాన్ని కుర్చీలో కూర్చోవడానికి అలవాటు చేయకండి. కాస్త ఒంటికి కూడా పని పెట్టండి.  మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రోళ్లు పక్కన పెట్టేశాం. కానీ ఒక్కసారి మళ్లీ వాటిని వాడి చూడండి. చేతులకు ఎంత గొప్ప వ్యాయామమో తెలుస్తుంది. వీలైతే బట్టలు కూడా వాషింగ్ మెషీన్లో కాకుండా చేత్తోనే ఉతకండి. అపార్ట్ మెంట్లో ఉంటుంటే లిఫ్ట్ వాడకండి. మెట్లు ఎక్కి దిగండి. కూరగాయలకు, సరుకులకు మీవారినో పిల్లల్నో పంపకుండా మీరే వెళ్లి అలా ఎంచక్కా నడిచి వెళ్లి తీసుకుని రండి. చిన్న చిన్న దూరాలకు కూడా ఆటోలు బస్సులు ఎక్కకుండా నడిచి వెళ్లండి. వెళ్లినప్పుడు సెల్ వాడినా... ఇంట్లో వాడటానికి ఓ ల్యాండ్ లైన్ పెట్టించుకోండి. అది రింగయినప్పుడల్లా పరుగు పరుగున వెళ్లడం కంటే మంచి వ్యాయామం ఏముంటుంది! జిమ్ కి వెళ్లే సమయం, వ్యాయామం చేసే తీరిక లేనప్పుడు కనీసం లైఫ్ స్టయిల్ ని మార్చుకుంటే మేలు జరుగుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: