ఫైనాన్స్ కంపెనీలతో వచ్చే చిచ్చు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రాణం పోతుందయ్యా అన్నా వినే రకమైతే కాదు ఫైనాన్స్ కంపెనీలు. తల తాకట్టు పెట్టన్నా సరే కిస్తీలు కట్టాలని పట్టుబట్టి కూర్చుంటారు. ఫైనాన్స్ వేధింపులు చాలా మందికి ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తికి కూడా ఫైనాన్స్ వేధింపులు ఎక్కువ అవడంతో ఎవరూ సాహసించలేని పనిచేశాడు అతడు. ఫైనాన్స్ వేధింపులు  ఎక్కువయ్యాయి అని పోలీసులకు చెప్పినా వారు పట్టించకపోవడంతో ఓ ఆటోవాలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే తన ఆటోకు నిప్పంటించాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట పరకాల పట్టణంలో ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆ ఆటోను కొనడం కోసం ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు తీసుకున్నాడు. అయితే సకాలంలో కిస్తీలు కడతానని చెప్పి డబ్బులు తీసుకున్న అతను చెప్పిన టైం కు కట్టలేకపోతున్నాడు. దానికి కారణం లేకపోలేదు.. కరోనా మహమ్మారి కారణంగా ఆటో సరిగ్గా నడవలేదు. దాంతో అతను కిస్తీలు కట్టడం ఆలస్యం అయ్యింది.  కాగా అతను ఫైనాన్స్ సిబ్బందికి తన ఇబ్బందులను కూడా తెలియజేసి తొందరలోనే కడతానని చెప్పాడు. అవేమీ పట్టించుకోని ఫైనాన్స్ సిబ్బంది ఆటో యాజమానిపై  తీవ్ర ఒత్తిడి చేశారు. దాంతో వారి వేధింపులు తాళలేక అతను పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

లాక్ డౌన్  మూలంగా ఆటో నడవక ఇల్లు గడవడమే కష్టం గా మారిందంటూ పోలీసులకు విన్నవించుకున్నాడు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ వారు పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ నుంచి మరింత ఒత్తిడి ఎక్కువైంది. దీంతో తీవ్ర  మనస్తాపానికి గురైన ఆటో యాజమాని ప్రవీణ్ పోలీసుల పట్ల వినూత్నంగా నిరసన చేపట్టాడు. తన ఆటోను పరకాల పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించి దాన్ని దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశాడు. ఆటో కొనడానికి అప్పు ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేకే ఇలా చేశానని తన ఆవేదన వ్యక్తం చేశాడు ప్రవీణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: