ఒక సమాజంలోని వ్యక్తుల ఐఖ్యత సమాజాన్ని శక్తివంతం చేస్తుంది. అలాగే ఒక రాజకీయ పార్టీ విజయం సాధించాలంటే అధికారంలోకి రావాలంటే ముందు అందులోని చిన్న, పెద్ద యువత వృద్ధ అనే విభేదాలు లేకుండా ఐఖ్యత సాధించాలి. దానికి కొందరు కొంత త్యాగం చేయవలసి రావచ్చు. ఆలా సిద్ధపడ్డ వాళ్ళుండే పార్టీ ఖచ్చితంగా ఒడిదుడుకులను   అధిగమించి అధికారంలోకి రాగలుగుతుంది. అయితే ఆలా త్యాగం చేయగల నాయకులు లేని ముసలి పార్టీ కాంగ్రెస్. చింత చచ్చిన పులుపు చావని పార్టీ కాంగ్రెస్. ఒక్కడంటే ఒక్కడు కనీసం కాటికి కాలు చాచిన ముసలిదైనా ముసలాడైన కుర్చీపట్టుకు వేలాడేవాడే.  

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అందులో సందేహం ఏ మాత్రం లేదు. కానీ ఆ ప్రయోజనం పొందిన పార్టీ టీఆరెస్ మోసం చేసి మరీ! హస్తం పార్టీకి చెయ్యిచ్చి మరీ! చెప్పి మరి ఆ పార్టీని తన పాదాల చెంత నేలకేసి కొట్టి మరీ తొక్కేసింది. మరి 130ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెసులో ఆ చేవ చచ్చిందా! ప్రతి ఒక్కడు తానొక్కడే హీరోగా చెప్పుకొంటాడు ఈ పార్టీలో విడివిడిగా ఒక్కొక్కడు సమర్థుడే. అంతా కలిస్తేనే తంటా. ఒకడి శృతి మరొకడికి అపశృతి అది ఆ పార్టీ నేటి దుస్థితి. రీతి నీతి లేని ఒక కుటుంబం తెలంగాణను స్వంతం చేసుకుంటుంటే చేష్టలుడిగి చేవచచ్చి చూస్తూ కూర్చుంది. దమ్మున్నోడైనా పగ్గాలు చేత లేనప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడేమి చేయగలడు? మగటిమిలేని కేంద్ర నాయకత్వం క్రింద పని చేయటమెలా?  


కొత్త రాష్ట్రం - మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డా ఏమీ సాధించలేక కచరా గారి ముచ్చట్ల మాయలో ముకుళించుకొని మూల కూర్చుంది. దుబ్బాక దెబ్బకు తెలంగాణ జనం తమ హృదయం తెలిపినా, మహానగరం తెగించి జవాబిచ్చినా, మగతనంలేని కాంగ్రెస్ కత్తులు దూయలేక పోవటానికి కారణం కేంద్ర నాయకత్వంలో చేవ చావటమే. రాష్ట్ర నాయకత్వంలో ఐఖ్యత శున్యమవటమే.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రయోజనం అనే మహాత్మ్యం అనే క్రెడిట్ ను - మరో మాయలోడు క్యాష్ చేసుకున్నా చూస్తూ  చేతి గుర్తు పార్టీ చేతులెత్తేసింది.


తెలంగాణలో హస్తం పార్టీ పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. పేరుకే ప్రతిపక్షం. ఉనికి కోసం తాపత్రయం. అంతలా దిగజారిపోయింది కాంగ్రెస్.
పార్టీ ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే సమర్థుడైన రక్తం పొంగిపొరలే యువ నేత నాయకత్వం ఎంతైనా అవసరం. పార్టీ పగ్గాలు చేతబట్టి తెగించి రధాన్ని పరుగెత్తించే సాహసి కావాలి. అలాంటోడు పీసీసీ అధ్యక్షుడుగా కావాలి. ఉత్తమ్ తర్వాత గట్టి పిండం కోసం వెతుకు తోంది అధిష్టానం. రేసులో మేమున్నా మంటూ సీనియర్లంతా హస్తినలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి సీనియర్లు ముతక వాసన కొడుతున్నారు. వీళ్ళు కేసీఆర్ విసిరేసిన పేలాలు ఏరుకోవటానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉబలాటపడిన బానిస వాసనలు వదుల్చు కోలేక పోతున్నారు.


అయితే, రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే తురుపు ముక్క కోసం చూస్తున్నారు. రాహుల్ లిస్టులో అందరికన్నా ముందున్నారు “వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి” అసలు రేవంత్ రెడ్డి మాటంటే ఒకనాడు లాగులో కార్చేసుకున్న కేసీఆర్ - కేటీఆర్ లు - నేడింకా బిజెపి దెబ్బకు జావగారి పోయున్న వేళ - సేనాపతిగా రేవంత్ అయితేనే సేనావాహినిని బాహుబలి లెవల్లో నడిపించి కాంగ్రెస్ కు గెలుపు రుచి చూపించగలడు


సీఎం కేసీఆర్ పై గట్టిగా పోరాడగల సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆయన మాట ఓ తూటా. గులాబీ బాస్ పై గురి పెట్టి వదిలే ఒక్కే డైలాగ్. రాజకీయంగా డైనమైట్ లా పేలుతుంటుంది. ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఎఫ్పటికప్పుడూ కడిగేస్తూ, నిలదీసే నేత రేవంత్.రాహుల్ గాంధీకి కావలసింది అలాంటి నాయకుడే. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని ప్రచార కన్వినర్ గా నియమించి, ఆయన కోసమే ప్రత్యేకం గా హెలికాప్టర్ కూడా కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కొడంగల్ లో ఓడిపోవడం రేవంత్ కాస్త తగ్గినట్టు కనిపించినా, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి, వెలుగు లోకి అగ్నిశిఖలా ప్రజ్వలించాడు.


మళ్లీ లైమ్-లైట్ లోకి వచ్చారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హడలెత్తిస్తున్నారు. అందుకే, రాహుల్ గాంధీకి రేవంత్ పై ఎనలేని గురి. లేటెస్ట్ గా రాహుల్ మది లోని మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి పై రాహుల్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పని తీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలో కంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని, అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.


మధుయాష్కితో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే, ఆయన సీనియర్ల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో సీనియర్లు సరిగ్గా పనిచేయడం లేదనే అభిప్రాయం రాహుల్ లో కనిపించింది.


పరోక్షంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని, పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పైనే ఆసక్తి చూపు తున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే, రాహుల్ గాంధీని ఆకట్టుకున్న రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో - టీ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మాత్రం వద్దు, ఆయన కన్నా మాకు స్టామినా ఎక్కువని వాదిస్తున్న నేతలు, పార్టీ పరమైన కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సొంత యాత్రలు చేసు కుంటున్నారు.


ఎన్నికల వేళ, పార్టీని అసలు పట్టించు కోవడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి ప్రచారం చేసిన రేవంత్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయం లోనూ అదే చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున రేవంత్ తప్ప ఎవరూ పెద్దగా కనిపించడం లేదు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, అప్పుడప్పుడు నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు.


హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజక వర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని టీపీసీసీ పోటీకి పెట్టింది. అక్కడ కూడా సీనియర్లు ఎవరు కనిపించడం లేదు. ఎంపీ రేవంత్‌రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్ సీనియర్లు కూడా ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. కలిసొచ్చే ఒకరిద్దరు నేతల సహాయంతో అభ్యర్థులు ప్రచారం చేసు కుంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు.


మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకుండా, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి లాంటి నేతలు, సొంత యాత్రలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సైకిల్ యాత్రలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమేనని వారు కవర్ చేసు కుంటున్నారు కాంగ్రెస్ నేతల తీరు చూసి, పదవులు ఇస్తేనే ప్రచారం చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ హైకమాండ్, అలా ఉన్నంత కాలం కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రాదని, అంటున్నారు.



రేవంత్ అంటే ధనవంతుడు అనే అర్ధం ఒకటైతే - మరో అర్ధం అశ్వశిక్షకుడు గుర్రాలను వేగం గా రయ్ మంటూ పరుగెత్తటం నేర్పేవాడు - అంతే గుర్రాలకు శిక్షణ ఇచ్చేవాడు అని అర్ధం. సరిగా ఉంది ప్రస్తుత పరిస్థితికి ఆయన పేరు. కాంగ్రెస్ గుర్రాలకు పరుగు నేర్పాలి అందుకే - బిజెపి బండి సంజయ్ కుమార్ ఎలాంటి సాధన సంపత్తి లేకుండా పార్టీని పరుగెత్తించి టీఆరెస్ కు దుబ్బాకలో దుమ్ములేపాడు - క్షేత్రస్థాయి పూర్తి కార్యకర్తల మద్దతు ఉన్న రేవంత్ - ఇప్పుడు సాగర్ ఉపఎన్నికలో ఒక పక్క విజయోత్సాహంలో ఉన్న గిత్తల బండిని ఢీ కొట్టాలి - మరో పక్క అధికారమధమెత్తిన మత్త గజం టీఆరెస్ తో చర్నాకోల ఝళిపించాలి. చూద్దాం! గుర్రం, గజం, గిత్తల పోరు!


మరింత సమాచారం తెలుసుకోండి: