చైనా మరోసారి భూటాన్ తో సున్నితంగా నడుచుకోవడానికి వెనుక కచ్చితంగా ఏదో వ్యూహం ఉంది అంటున్నారు నిపుణులు. ఇప్పట్లో తైవాన్ పై కి వెళితే అది ప్రపంచానికి తన పట్ల ఉన్న అభిప్రాయంలో మార్పులు తెస్తుందేమో అని భావించి భూటాన్ వైపు ప్రపంచాన్ని తిప్పి ఉండవచ్చు. అందుకే తాజాగా చైనా-భూటాన్ సరిహద్దుల సమస్యను సామరస్యంగా చర్చించుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు దేశాలు ఈ ఒప్పందం కోసం మూడు సార్లు దశల వారీగా చర్చలలో పాల్గొన్నారు. అనంతరం సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించారు. ఈ తాజా ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి.

ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య చాలా కాలంగా సద్దుమణగలేదు, అయితే ఆ సమస్యను పరిష్కరించాలి అని గతంలో చర్చలకు అడుగులు వేయాలని నిర్ణయించాయి. ఆ తరువాత కొద్ది రోజులకే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి చైనా-భూటాన్ లు. దీనికి ముందు చైనానే అడుగులు వేయడం జరిగింది. ఈ నెల 14న రెండు దేశాల రాజధానులు బీజింగ్, థింపూ లో చర్చలు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైనా సహాయ విదేశాంగ మంత్రి వు జియాంగ్ హావో తాజా ఒప్పందాలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను నెలకొల్పడానికి సహకరిస్తుందని అన్నారు.

భూటాన్ 400 కిలోమీటర్ల మేర చైనా తో సరిహద్దులను పంచుకుంటుంది. ఇప్పటి వరకు సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇద్దరు 24 సార్లు చర్చలు జరిపారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేనప్పటికీ, ఆయా దేశాల అధికారులు మాత్రం సందర్శనల ద్వారా పరిచయాలు కొనసాగిస్తూ ఉన్నారు. చైనా ఇప్పటివరకు 12 పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగా, కేవలం భారత్, భూటాన్వి మాత్రం ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. తాజా భూటాన్ ఒప్పందం అమలు అయితే, భారత్ విషయంలో కూడా అదే జరగటానికి అవకాశాలు ఉన్నాయా అన్నది మాత్రం సందేహమే. భూటాన్ తో కూడా ఈ హటాత్తు ప్రేమలు ఎందుకంటే దానితో కూడా భారత్ సన్నిహితంగా ఉంటుంది కాబట్టి, దానిని తమవైపు తిప్పుకోవడానికే  ఈ తతంగం. అంటే చైనా వలలో మరో పిట్ట చిక్కినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: