టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఎక్క‌డ పోగొట్టుకున్నామో అక్క‌డే ద‌క్కించుకోవాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దీంట్లో భాగంగా ఇటీవ‌ల కాలంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చకు కార‌ణం అవుతోంది. మ‌ళ్లీ మంగ‌ళ‌గిరి నుంచే బ‌రిలోకి దిగుతాన‌ని చెప్ప‌డమే కాదు.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డానికి కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో లోకేశ్ ముందుకు సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి బ‌రిలోకి దిగిన ఆళ్ల రామ‌కృష్ణ‌రెడ్డిపై పోటీ చేసిన లోకేశ్ ప‌రాభ‌వాన్ని చ‌విచూశాడు.


   మొద‌టి సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసిన లోకేశ్ ఓట‌మి పాల‌వ్వ‌డంతో అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వైసీపీ నేత‌లు మంగ‌ళ‌గిరి ఓట‌మిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేరే నియోజ‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతాడ‌నే చ‌ర్చ సాగింది. అయితే, లోకేశ్ మాత్రం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. రానున్న ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే లోకేశ్ పావులు క‌దుపుతున్నార‌ని తాజా ప‌రిణామాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌ను చేస్తూ ఆళ్ల‌ను ఢీ కొట్ట‌డం అంత సులువైన‌ది కాద‌ని విశ్లేష‌కుల అంచ‌నా.


   గ‌త నెల రోజుల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నాడు. ఆ నియోజ‌వ‌ర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ‌గా ఉండ‌డంతో చేనేత నేస్తం అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేశ్ ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పై లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌డం వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే, రానున్న ఎన్నిక‌ల్లో నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లో పోటీ చేసి గెలుస్తారా లేదా అనేది అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: