తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో గ్రూపురాజకీయాలు చూస్తున్న వాళ్ళకు రోతపుడుతోంది. అధికారం నుండి దూరమై ఎనిమిదన్నరేళ్ళవుతున్నా నేతల్లో చాలామందికి ఇంకా బుద్ధిరాలేదు. అందరు కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చే విషయాన్ని వదిలేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎందుకూ పనికిరాని పదవుల కోసం, కమిటిల్లో జూనియర్లకు చోటిచ్చి సీనియర్లకు ఇవ్వకుండా అవమానించారంటు కొందరు నానా రచ్చ చేస్తున్నారు. పోనీ ఇలాంటి వాళ్ళవల్ల పార్టీకి ఏమైనా ఉపయోగమా అంటే అదీలేదు.

పార్టీలోని చాలామంది నేతల్లో పార్టీ వల్ల లాభపడ్డవారే కానీ పార్టీకి ఉపయోగపడిన వారు లేరనే చెప్పాలి. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటిలో తనకు చోటు కల్పించకుండా అవమానించారంటు పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి కొండా సురేఖ నానా గోల చేస్తున్నారు. తనను పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా అవమానిస్తోందని రెచ్చిపోతున్నారు. జడ్పీటీసీగా ఉన్న సురేఖ రెండుసార్లు ఎంఎల్ఏగా ఒకసారి మంత్రయ్యారంటే అది పార్టీ వల్లే అన్న విషయాన్ని మరచిపోయారు.

రెండుసార్లు ఎంఎల్ఏని చేసి మంత్రిగా పనిచేసే అవకాశమిచ్చిన పార్టీ కష్టాల్లో ఉన్నపుడు తాను ఆదుకోవాలన్న కనీస ఇంగితం కూడా సురేఖకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక పార్టీపరంగా గతంలో ఎన్నో పదవులు అందుకున్న బెల్లయ్యనాయక్ కూడా పార్టీ తనను అవమానించిందంటు నానా గోలచేస్తున్నారు. పట్టుమని ఇద్దరు కార్పొరేటర్లను కూడా గెలిపించలేని సీనియర్ మోస్ట్ నేత వీహెచ్ కూడా కమిటీల కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడితో సమాన అధికారాలున్న తనకు కూడా తెలియకుండానే అధిష్టానం కమిటిలు వేసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తంచేయటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే సీనియర్లు, జూనియర్లనే తేడాలేకుండా రోడ్డునపడి గొడవలు పడుతున్న కారణంగానే జనాలు కాంగ్రెస్ కు దూరమై పోతున్నారు. జనాలకు కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా నేతలకే తమపార్టీపై అభిమానం లేదు. అధికారంలో ఉన్నా గొడవలే ప్రతిపక్షంలో ఉన్నా గొడవలే అన్నట్లుగా తయారయ్యారు. పొరబాటున ఎవరైనా ఓట్లేసి గెలిపిస్తామని అన్నా తమకు ఓట్లేసి గెలిపించటానికి మీరెవరంటు వాళ్ళని వెంటబడి చావకొట్టేట్లున్నారు కాంగ్రెస్ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: