
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డికి డిమాండ్ బాగా పెరిగిపోతున్నట్లుంది. తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. షెడ్యూల్ ఎన్నికలయితే డిసెంబర్లో జరగాలి. ఆ తర్వాత 2019లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ముందుగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఆధారపడుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం అన్నీపార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఖమ్మంలో మాజీ ఎంపీని తమ పార్టీల్లో చేర్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ లెవల్లో పొంగులేటితో ఇప్పటికే పై పార్టీల్లోని కీలక నేతలు మంతనాలు జరుపుతున్నారని సమాచారుం. ఇందులో భాగంగానే ఖమ్మం కాంగ్రేస్ కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లు పొంగులేటిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అసలు పొంగులేటికి ఇంత డిమాండు రావటానికి కారణాలు ఏమిటి ?
ఏమిటంటే మొదటిది ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధాయిలో ఉండటం. రెండో కారణం ఏమిటంటే జిల్లా వ్యాప్తంగా గట్టి మద్దతుదారులుండటం. మూడో కారణం ఏమిటంటే జనాల్లో కూడా పొంగులేటి అంటే సానుకూల వాతావరణం ఉండటం. ఈ మూడు పాయింట్లు జిల్లాలోని ఇతర పార్టీల్లో ఏ నేతకు లేదనే చెప్పాలి. ఈ మాజీఎంపీ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి మంచి లాభం ఉంటుందనటంలో సందేహంలేదు.
బీజేపీలో చేరితే అభ్యర్ధులను నిలపటంతో పాటు ఆర్ధికంగా కూడా ఆదుకుంటారనటంలో సందేహంలేదు. ఇక కాంగ్రెస్ లో చేరితే అభ్యర్ధులను నిలబెట్టాల్సిన అవసరం ఉండదుకానీ ఆర్ధికంగా మాత్రం ఆదుకోవాల్సుంటుంది. అభ్యర్ధుల కొరతతో బీజేపీ, ఆర్ధిక వనరుల కొరతతో కాంగ్రెస్ బాగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అందుకనే పై రెండుపార్టీలు పొంగులేటిని తమ పార్టీల్లో చేర్చుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. మరి పొంగులేటి ఆలోచనలు ఎలాగుంటాయో చూడాల్సిందే. అప్పటివరకు పై రెండుపార్టీలకు ఈ సస్పెన్సు తప్పదు.