చెప్పినట్లే విశాఖస్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేసీయార్ దూకుడు పెంచారు.  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు చేయలేని పనిని కేసీయార్ చేసి చూపించాలని డిసైడ్ అయ్యారు. కేంద్రప్రభుత్వంతో ఉన్న అనేక అవసరాల కారణంగా జగన్ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సినంతగా అడ్డుకోవటంలేదు. ఇక చంద్రబాబు విషయం ఎంతతక్కువ చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్న మోడీని ఏమనలేక పదేపదే జగన్ను మాత్రమే చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు.





సో, ఈ విషయంలో వీళ్ళిద్దరి చేతకానితనం కేసీయార్ కు బాగా అర్ధమైంది. ఎటూ ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు కదా. అందుకని తన ఎంట్రీని ఉత్తరాంధ్ర నుండి మొదలుపెట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని అజెండాగా తీసుకున్నారు. ఏపీ అద్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పినదాని ప్రకారం తొందరలోనే విశాఖలో కేసీయార్ బహిరంగసభ జరగబోతోంది. చాలాకాలంగా మోడీ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న కేసీయార్ విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా తగులుకుంటారనే అనుకుంటున్నారు. ఉద్యమాలకు కూడా రెడీ అవుతున్నారు. 





ఒకవైపు రాజకీయంగా మోడీపై ఒత్తిడి పెంచుతునే మరోవైపు టెక్నికల్ వ్యవహారాల్లో కూడా స్పీడుగా పావులు కదుపుతున్నారు. ఫ్యాక్టరీని సొంతం చేసుకునేందుకు అవకాశమున్నంతలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఫ్యాక్టరీని కేంద్రం వేలంపాట వేస్తే బిడ్డింగులో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అవసరమైన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటిని వేశారు. ఉన్నతాధికారుల బృందం వైజాగ్ వెళ్ళి స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మాట్లాడింది.  





పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, టీఎస్ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, సింగరేణి కాలరీస్ లో ఇద్దరు సీనియర్ డైరెక్టర్లతో ఏర్పాటైన కమిటి బిడ్డింగుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సమస్యల్లో నుండి బయటపడేసేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం. ఐరన్ ఓర్ లభ్యత, రవాణా తదితర అంశాలపై వివరాలు సేకరించేందుకు కమిటిలోని నిపుణులు  విశాఖ స్టీల్స్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు.  దీంతోనే  కేసీయార్ దూకుడు పెంచినట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: