నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చదివిన తర్వాత చంద్రబాబును నరేంద్రమోడీ ఎందుకు దూరంగా ఉంచుతున్నారనే విషయంపై క్లారిటి వచ్చుంటుంది. గడచిన నాలుగేళ్ళుగా బీజేపీకి దగ్గరవుదామని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా మోడీ అవకాశం ఇవ్వటంలేదు. ఎందుకంటే అవసరాన్ని బట్టి రెండుసార్లు బీజేపీతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దగ్గరై అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేశారు.





అవసరార్ధం పొత్తులు పెట్టుకుని తర్వాత విడిపోయిన పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ చంద్రబాబు ఏమిచేశారంటే రెండుసార్లూ బీజేపీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. పైగా 2018లో బీజేపీకి దూరమైన తర్వాత మోడీతో పాటు కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా దూషించారు. అందుకనే చంద్రబాబును నమ్మకుండా దూరంగా ఉంచేస్తున్నది. ఇపుడు విషయం ఏమిటంటే తన ట్వీట్లో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం చారిత్రాత్మకమైనదన్నారు. చారిత్రాత్మకమైన కట్టడానికి దోహదపడిన నరేంద్రమోడీకి, కేంద్రానికి అభినందనలు తెలిపారు.





అయితే పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వానికి తమ పార్టీ మద్దతుంటుందని చంద్రబాబు ఒక్కమాట కూడా చెప్పలేదు. పార్లమెంటు భవనాన్ని మోడీ ప్రారంభించటాన్ని ప్రతిపక్షాల్లోని 19 పార్టీలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.  ఇదే సమయంలో పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నందుకు మోడీకి  జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తమ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పారు. అంతేకాకుండా 27వ తేదీన నీతిఅయోగ్ కార్యక్రమంలో పాల్గొంటున్న జగన్ మరుసటిరోజు పార్లమెంటు భవనం ప్రారంబోత్సవంలో కూడా పాల్గొంటున్నారు.





అంటే మోడీకి మద్దతుగా వ్యతిరేకంగా అనేక పార్టీలు స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాయి. మరి చంద్రబాబు మాత్రం ఈపని ఎందుకు చేయలేదు ? ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు పాల్టొంటారని ఎందుకు ప్రకటించలేదు ? ఒకవైపు బీజేపీతో ఎలాగైనా పొత్తుపెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మోడీకి దగ్గరయ్యేందుకు వచ్చిన అవకాశంపై గోడమీద పిల్లివాటంలాగ ఎందుకు వ్యవహరించారో అర్ధంకావటంలేదు. చంద్రబాబు మనస్తత్వం బాగా స్టడీ చేశారుకాబట్టే మోడీ దూరంగా ఉంచుతున్నారనే విషయంలో ఇప్పటికి క్లారిటి వచ్చుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: