కంటికి రెప్పలా కాపాడే తండ్రి కన్న కూతురిని గాలికి వదిలేసాడు. కన్నతల్లి కూతుర్ని ఒంటరిదాన్ని చేసి దేవుడి దగ్గరకి వెళిపోయుంది. తల్లి లేని లోటు తీరుస్తుందని నమ్మి  తెచ్చుకున్న మారు  తల్లి పట్టించుకోలేదు.ఇలాంటి పరిస్థితులలో ఆ ఆడబిడ్డ ఎంతగా కుమిలిపోయిందో ఊహించుకోండి.. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇంటర్ దాక చదివింది.. ఇకమీదట అయినా దేవుడు చల్లగా చూసి మంచి భర్త, అత్త మామల్ని ఇస్తాడని ఆశించింది. కానీ దేవుడు చిన్నచూపు చూసాడు. కట్టుకున్న భర్తే కాల యముడిలా మారి ప్రాణం తీసాడు. నిండు గర్భిణీ అని కూడాచూడలేదు.  అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

 

 


శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తో ఒకసారిగా  ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు వివరాలలోకి వెళితే  మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..  బనగానపల్లె పట్టణానికి చెందిన సుంకన్న, లక్ష్మీదేవి  దంపతుల కూతురు సుస్మిత (19). ఈ యువతి చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో తండ్రి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మస్తానమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మారు తల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి సుస్మితను  నానా ఇబ్బందులు పెట్టేది. తిండి కూడా సరిగా పెట్టేది కాదు. ఈ చిత్ర హింసలు తట్టుకోలేక ఆమె  పిన్నమ్మ, తాతల దగ్గర ఉంటూ ఇంటర్‌ పూర్తి చేసింది. తర్వాత మారు తల్లి  మస్తానమ్మ తన  భర్తపై ఒత్తిడి చేసి సుస్మితను తన తమ్ముడు ప్రతాప్‌ తో పెళ్లి  జరిపించింది. చెడు ప్రవర్తన గల మారుతల్లి  సుస్మితను కూడా ఆ వైపునకు మలిపేందుకు ప్రయత్నించేది. అందుకు ఆ యువతి ససేమీరా అంది. మారుతల్లి ప్రవర్తన నచ్చకపోవడంతో  వేరే కాపురం పెడదాం అనుకుంది.దీనికి భర్త ప్రకాష్ ఒప్పుకోలేదు. 

 

 

 


దీనిని జీర్ణించుకోలేని మారుతల్లి, అత్తామామలు సుస్మిత గురించి ప్రతాప్‌కు చెడుగా చెప్పేవారు. దీంతో సైకోగా మారిన అతను  భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యకు మాయమాటలు చెప్పి తన సొంత ఆటోలో ఎక్కించుకుని  నల్లగట్ల – బత్తలూరు మార్గంలోని హైవే వద్దకు తీసుకుపోయాడు. అక్కడ అతి కిరాతకంగా భార్య చేతులు కట్టి నరాలు కోసి పక్కనున్న నీటి కుంటలో పడేసి  పారిపోయాడు.

 

 


 కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ అని కూడా ఆలోచించలేదు అతి క్రూరంగా చంపేశాడు.  ఆదివారం నిందితుడే తమ బంధువులకు పోను చేసి హత్య విషయం చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి మృత దేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు.  వెనువెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.   బంధువులు   ఫిర్యాదు మేరకు హతురాలి భర్త ప్రతాప్, బావ భాస్కర్, మారుతల్లి మస్తానమ్మ, అత్తామామలు లక్ష్మీదేవి, వీరయ్యలపై కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: