దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 150కు చేరగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం రేపటినుండి విద్యాసంస్థలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూళ్లు, కాలేజీలతో పాటు యూనివర్సిటీలు కూడా మూతపడనున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే అన్ని రాష్టాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం యథావిథిగా జరుగుతాయని ప్రకటించింది. 
 
ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. 
 
సీఎం జగన్ విద్య, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే సెలవులు ప్రకటించటంతో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ప్రజల నుండి ప్రభుత్వానికి సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక కరోనా పాజిటివ్ నమోదు కాగా ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 13 జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది. విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: