రాష్ట్రంలో  రాజకీయం చాలా హీట్ గా ఉంది. వైసీపీ ఒక వైపు మిగిలిన పార్టీలు మరో వైపు మోహరించి ఉన్నాయి. మరో నాలుగు నెలలలో  రెండేళ్ళు పూర్తి చేసుకోబోతున్న జగన్ సర్కార్ ని గట్టిగా బిగించడానికి విపక్షం ఒక్కటిగా మారి  కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో  దక్షిణ అయోధ్యగా పేరు పొందిన రామతీర్ధం రాముడిని జరిగిన అపచారంతో ఆస్తిక జనం కలత చెందింది. దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు మసాలా నూరుతున్నాయి. ఇక ఏపీలో అచ్చంగా వైసీపీ బీజేపీల మధ్య విగ్రహాల విధ్వంసం మీద పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మాణం కోసం తన వంతుగా విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు భూరి విరాళమే ప్రకటించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ట్రస్ట్ కి ఆయనతో పాటు ఆయన కుమారుడు డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ కలసి అయిదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ట్రస్ట్ సభ్యులకు ఆ విరాళాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ఉన్నారు.

ఓ వైపు బీజేపీ వైసీపీల మధ్య రాజకీయ యుధ్ధం సాగుతున్న వేళ బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ నేతలకు రమణమూర్తి రాజు భూరి విరాళం ప్రకటించడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇందులో భక్తి తప్ప వేరే విధమైన  రాజకీయం ఏమీ లేకపోయినా కూడా  ఏపీలో  సందర్భం  సమయం  చూస్తే వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని మాత్రం కొంత చర్చగానే ఉందని అంటున్నారు. మరో వైపు కపిల తీర్ధం టూ రామతీర్ధం అంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు రధయాత్రకు రెడీ అవుతున్నారు. దాని మీద వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాటల తూటాలు పేలుస్తున్నారు. మరి ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత రాజు తనదైన రామ భక్తిని చాటుకోవడం విశేషం. అది పెడార్ధాలకు దారి తీయకపోయినా ఒక సంచలనమే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: