రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి, వారం లోగా కార్డు పొందండి, సరుకులు తీసుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటించుకుంటాయి. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రేషన్ సరకుల రేటు పెంచే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు రేషన్ కార్డులకే ఎసరు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్‌ సరకులు పొందుతున్న వారి సంఖ్యను తగ్గించాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆహార రాయితీలకు రూ.4.22 లక్షల కోట్లు ఖర్చవుతున్న దృష్ట్యా ఈ భారాన్ని తగ్గించాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం గ్రామ ప్రాంతాల్లో 75 శాతం మంది ప్రజలకు రేషన్‌ అందుతుండగా దాన్ని 60 శాతానికి, పట్టణాల్లో 50 శాతం మందికి ఇస్తుండగా దాన్ని 40 శాతానికి పరిమితం చేయాలని సూచించింది. దీనివల్ల రూ.47,229 కోట్లు ఆదా అవుతుందని, దాన్ని విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చని తెలిపింది.

నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం యథావిధిగా అమలు చేస్తుందని చెప్పలేం కానీ, వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఏటా 47,229కోట్ల రూపాయలు ఆదా చేస్తామంటే ఎవరికి మాత్రం ఆశగా ఉండదు చెప్పండి. అందులోనూ కేంద్రం ప్రైవేటీకరణపై దూకుడు పెంచింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ, నగదు సమీకరణ మొదలు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డులు కట్ చేయాలని, అలా చేస్తే కేంద్రంపై భారం తగ్గుతుందని, ఏకంగా 47వేలకోట్లు ఆదా అవుతుందని నీతిఆయోగ్ చెప్పిన మాటల్ని కేంద్రం పెడచెవిన పెడుతుందని అనుకోలేం. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో కేంద్రం రేషన్ కార్డులపై దృష్టిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు రేషన్ కార్డుల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో దానికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: