తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో బయటపడుతున్న నిజాలు షాకింగా ఉన్నాయి. గడచిన నాలుగు రోజులుగా తెలంగాణా రాష్ట్రం మొత్తంమీద ఇంటింటి సర్వే చేయిస్తోంది ప్రభుత్వం. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో సుమారు 2.5 లక్షల మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బయటపడింది. జ్వరం, జలుబు+విపరీతమైన దగ్గు, కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారే ఎక్కువమందున్నట్లు తెలిసింది.




లక్షలాది ఇళ్ళల్లోని కుటుంబసభ్యుల్లో ఒకిరికి మించి పై లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. రోగుల లక్షణాలను గుర్తించిన సిబ్బంది అప్పటికప్పుడే మందుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన వారిని ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణలో మార్పులు, విపరీతంగా పెరిగిన చలిగాలల కారణంగా ఎక్కువమందిలో జలుబు, దగ్గు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు.




ఇవే లక్షణాలు ఎక్కువరోజులు కంటిన్యు అయితే కరోనా వైరస్ లేదా ఒమిక్రాన్ గా మారే ప్రమాదముందని వైద్యాధికారులు టెన్షన్ పడుతున్నారు. అందుకనే జలుబు, దగ్గు తగ్గే విధంగా సిబ్బంది అప్పటికప్పుడే మందులు ఇస్తున్నారు. పైన చెప్పిన 2.5 లక్షల కేసులు అధికారికంగా గుర్తించినవి మాత్రమే. సర్వేకు వెళ్ళినపుడు లాక్ చేసిన ఇళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయట. అలాగే జలుబు, దగ్గు లక్షణాలు కనబడుతున్నా తాము బాగానే ఉన్నామని చెబుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట.




అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.03 లక్షల ఇళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1.3 లక్షల ఇళ్ళు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5. 41 లక్షల ఇళ్ళు, ఖమ్మంలో 1.33 లక్షల ఇళ్ళలో ఫీవర్ సర్వే చేశారు. ఏ జిల్లాలో చూసినా ఏదో సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు ఆరోగ్య కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్లయితే ఇళ్ళల్లోని వారు ఆరోగ్య కార్తకర్తలకు సరైన సమాధానాలు కూడా చెప్పటం లేదని సమాచారం. ఏదేమైనా లక్షలాది మంది జనాలు అనారోగ్య లక్షణాలతో బాధపడటమంటే చిన్న విషయమైతే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: