ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.  ‘రామప్ప’ అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు. శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన ఈ రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో ఉంది.  అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప అణువణువునా ప్రత్యేకతలతో, అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో కాకతీయుల ఘనకీర్తిని చాటి చెబుతుంది. అంతేకాదు, ఈ ఆల‌యంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు దాగున్నాయి. 

 

సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. కానీ రామప్ప ఆలయంలోని గర్భాలయంలో రాత్రివేళలో తప్పా రోజంతా వెలుతురు ఉంటుంది. ఇందుకు ఆలయంలో నిర్మించిన స్తంభాలే కారణం. బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుంది. అలాగే ఈ శివాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ దొరికిన రాతిశాసనాల్లో ఉంది. ఈ ఆలయం నిర్మాణం పూర్తికావడానికి 40 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అద్భుత శిల్పకళ కట్టిపడేస్తుంది.

 

ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు.. నీళ్లలో వేస్తే తేలుతాయట. ఇది విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా నిజ‌మంటున్నారు. అవును! రామప్ప కట్టడం ఆద్యంతం అద్భుతమే. శాండ్ బేస్డ్ టెక్నాలజీతో ఇసుక పునాదులపై ఈ దేవాల‌యాన్ని నిర్మించారు. ఇక‌ నీళ్లపై తేలియాడే బరువులేని ఇటుకలతో నిర్మించిన కట్టడం మ‌రియు ఒకే రాయిలో మూడు రంగులు కలిగి ఉండడం ప్రధానమైన అంశం. అలాగే ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం సప్తస్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమపదనిసలు పలుకుతుంది. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్న ఈ రామ‌ప్ప ఆల‌యాన్ని ఒక్క‌సారి అయినా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: