ప్రధానమంత్రి నరేంద్రమోడి అంటే చంద్రబాబునాయుడు భయపడుతున్నాడనేందుకు ఇదే తాజా ఉదాహరణ. భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రైతులతో పాటు సామాన్యజనం కూడా నష్టపోయారు. అయితే వారంరోజుల పాటు ముంపులో ఉంటేనే  బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముంపులో వారంరోజులుంటేనే నిత్యావసరాలు ఇస్తారా ? లేకపోతే ఇవ్వరా ? అంటూ హూంకరించేశాడు. దేశంలో ఏ ప్రభుత్వము ఇటువంటి దిక్కుమాలిన నిబంధన పెట్టలేదంటూ మండిపోయాడు. నిజమే చంద్రబాబు కోపానికి అర్ధముంది. కానీ ఇటువంటి దిక్కుమాలిన నిబంధన పెట్టంది జగన్ ప్రభుత్వం కాదు.  కేంద్ర ప్రభుత్వం 2015లో  తీసుకొచ్చిన దిక్కుమాలిన నిబందన వల్లే రాష్ట్రప్రభుత్వం కూడా ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సొచ్చింది.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఎన్డీఏతో కలిసున్నపుడే కేంద్రం ఇటువంటి దిక్కుమాలిన నిబంధనను తీసుకొచ్చింది. మరపుడు ఎన్డీఏలో పార్టనర్ గా ఉన్న చంద్రబాబు కేంద్రాన్ని అప్పుడు ఎందుకు నిలదీయలేదు.  చంద్రబాబు అదృష్టం ఏమిటంటే తాను ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువే తప్ప వర్షాలుండవు. కాబట్టి వర్షాలు లేకపోతే భారీ వర్షాల వల్ల జరిగే నష్టాలతో చంద్రబాబుకు ఎప్పుడూ  పనుండదు. దిక్కుమాలిన నిబంధన గురించి చంద్రబాబుకు తెలీకుండానే ఉంటుందా ? ఎందుకు తెలీదు బాగా తెలుసు. కాకపోతే నరేంద్రమోడిని అనేంత సీన్ చంద్రాలు సారుకు లేదు. కేంద్రంపై గట్టిగా రెండు మాటలంటే తర్వాత ఏమి జరుగుతుందో మిగిలిన వాళ్ళకన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే కేంద్రం చేసిన తప్పును కూడా జగన్ ఖాతాలో వేసేసి నోరుపారేసుకుంటున్నాడు.





ఇక మరో విషయం చూద్దాం. ఈమధ్యే కేంద్రం అమల్లోకి వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని తెచ్చింది. దీనిపై పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల్లోని రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ లో అయితే రైతు సంఘాలంతా ఏకమై కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. రైతాంగం ఒత్తిడి తలొంచిన అకాలీదళ్  పార్టీ ఏకంగా ఎన్డీఏలో నుండి బయటకే వచ్చేసింది. చివరకు ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసెంబ్లీలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త చట్టంలో భాగంగానే వ్యవసాయ విద్యుత్ కు జగన్ ప్రభుత్వం మీటర్లను బిగించాలని డిసైడ్ చేసింది. దీన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.  వ్యవసాయ సంస్కరణల బిల్లులో  ఏముందు చదవకుండానే టీడీపీ పార్లమెంటులో మద్దతుగా ఓట్లేసిందా ?





పార్లమెంటులో కొత్త వ్యవసాయ చట్టానికి మద్దతుగా ఓట్లేసిన టీడీపీ రాష్ట్రానికి వచ్చేసరికి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. వ్యవసాయానికి మీటర్లు అన్నది కూడా మోడి నిర్ణయమే. దీన్ని జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారంతే. దాంతో మోడిని ఏమనలేక తన కోపాన్నంతా జగన్ పైనే చంద్రబాబు చూపుతుండటమే విచిత్రంగా ఉంది.  ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటం, అయినదానికి కానిదానికి కూడా జగన్నే బూచిగా చూపించి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు కాబట్టే చంద్రబాబు చేసే ఆరోపణలను జనాలు పట్టించుకోవటం మానేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: