భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోందని చెప్పడానికి మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులే ఉదాహరణ. అయితే ఇలాగే ఇటీవల ఢిల్లీలో కూడా కేసులు పెరిగినా దాని ప్రభావం మిగతా చోట్ల పడలేదు. కొత్త వేవ్ మొదలు కాలేదు. మరిప్పుడు ముంబై కేసుల వల్ల మళ్లీ జనం భయపడాలా.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారు..?

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. మొత్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇది నాలుగో వేవ్ కి సంకేతమనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో టాటా ఇన్‌ స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (TIGS) ఓ కీలక సమాచారాన్ని విడుదల చేసింది. TIGS డైరెక్టర్ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఫోర్త్ వేవ్ వార్తలపై స్పందించారు. భారత్ లో ఇప్పటికిప్పుడు నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. అయితే కొవిడ్‌ కేసులు పెరుగుతూ పోతుండటం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే నష్టమేంటి..?
కరోనా కేసులు అక్కడక్కడా వస్తున్నాయి, అందరికీ రావట్లేదు, పెరిగి మళ్లీ తగ్గిపోతున్నాయి. దీంతో చాలామంది కొవిడ్ నిబంధనలను పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని చెబుతున్నారు రాకేశ్ మిశ్రా. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ జీవించి ఉన్నంతకాలం అది కొత్త వేరియంట్లకు అవకాశమిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ అని అన్నారు. మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు కరోనా ముప్పుని నివారించ వచ్చని అంటున్నారాయన. టీకాలు తీసుకున్నవారు, గతంలో ఇతర వేరియంట్లు సోకినవారికి.. తాజాగా భారత్ ని ఇబ్బంది పెట్టిన ఒమిక్రాన్ సోకలేదని వివరించారు మిశ్రా. ఒకవేళ సోకినా.. దాని తీవ్రత చాలా తక్కువగా ఉందని, చాలామందిలో లక్షణాలు లేకుండానే వైరస్ తొలగిపోయిందని అన్నారు.

అయితే గతంలో కొవిడ్ వచ్చినవారు కూడా ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడితే మాత్రం కొత్త వేరియంట్ వచ్చినట్టే భావించాలని అంటున్నారు డాక్టర్ మిశ్రా. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయించాలని, అప్పుడే కొత్త వేరియంట్లను మనం కనుగొనగలమని, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలమని చెబుతున్నారు. మాస్క్ ధరించడం మాత్రం మరచిపోవద్దని ప్రజలను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: