2020 వ సంవత్సరం మార్చ్ నెల చివరి నుండి ఇప్పటికీ కూడా మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన వికృత చేష్టలను చూపిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మహమ్మారి ప్రభావం కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మహమ్మారి నిర్మూలనకు ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా మనదేశంలో ఉత్పత్తి చేసిన కరోనా టీకా ‘కొవాగ్జిన్’ సామర్థ్యంపై పలు విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్ మృతి చెందిన ఘటన తర్వాత మరిన్ని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక సీనియర్ వైద్యుడు, ఆ రాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దయానంద్ సాగర్ కరోనా వ్యాక్సిన్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ను హెల్త్ కేర్ వర్కర్లపై నిర్వహిస్తున్నారా అని ఆయన నిలదీశారు. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌కు ఎమర్జెన్సీ అనుమతి ఇవ్వడంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.
 
 
 
 
 కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలలో ఏది ఎంచుకోవాలనే అంశంపై తుది నిర్ణయాన్ని హెల్త్ కేర్ వర్కర్లకే వదిలేయాలని డాక్టర్ సాగర్ సూచించారు. ‘దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, కొవాగ్జిన్ ఇంకా ఫేజ్-3 ట్రయల్స్‌లో ఉంది. అంటే ఈ ప్రయోగాలను ఆరోగ్య సిబ్బందిపై నిర్వహిస్తున్నట్టా..? మేం దీన్ని ఖండిస్తున్నాం. ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలనే అంశంపై కరోనా యోధులకు ఛాయిస్ ఇవ్వాలి’ అని దయానంద్ సాగర్ అన్నారు. కర్ణాటకలో తొలి దశ వ్యాక్సిన్ పంపిణీలో టీకా తీసుకున్న హెల్త్ వర్కర్ నాగరాజు (43) రెండు రోజుల తర్వాత మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో దయానంద్ సాగర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే.. ఆ హెల్త్ వర్కర్ గుండె పోటు కారణంగానే మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని వివరించారు. టీకా తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు ఉత్సాహంగా ఉన్నారని వెల్లడించారు. యూపీలోనూ ఓ హెల్త్ వర్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లోనే ఆయన చనిపోయాడు. ఆయన కూడా గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: