సెక్స్ వల్ల కార్డియాక్ అరెస్ట్ సమస్య తలెత్తే సందర్భాలు చాలా అరుదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. గుండెపోటుకు శృంగారానికి మధ్య సంబంధంపై ఇప్పటికే అధ్యయనాలు జరిగాయని, అయితే గుండె ఆగిపోవడానికి శృంగారానికి మధ్య సంబంధంపై తమదే తొలి అధ్యయనమని అమెరికాలోని సెడార్స్-సినాయ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సుమీత్ చుగ్ చెప్పారు.

 

అధ్యయన ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశంలో వెల్లడించారు.గుండె హఠాత్తుగా ఆగిపోతే స్పృహ కోల్పోతారు, శ్వాస ఆగిపోతుంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ ప్రక్రియతో చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.అమెరికాలో 4,557 కార్డియాక్ అరెస్టు కేసులను పరిశీలించగా, అందులో 34 మందికి మాత్రమే సంభోగంలో పాల్గొంటుండగా, లేదా సంభోగంలో పాల్గొన్న గంట లోపు గుండె ఆగిపోయినట్లు తెలిసింది. ఈ 34 మందిలో 32 మంది పురుషులే.

 

అధ్యయనం కోసం డాక్టర్ సుమీత్ చుగ్, ఆయన సహచరులు అమెరికాలో ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్ నగరంలోని ఆస్పత్రుల రికార్డులను పరిశీలించారు. ఒకటి కన్నా తక్కువ శాతం కేసుల్లోనే గుండె ఆగిపోవడానికి, సెక్స్‌కు సంబంధం ఉన్నట్లు వారి దృష్టికి వచ్చింది.ఈ కేసుల్లో అత్యధికులు పురుషులేనని, ఎక్కువ మంది మధ్య వయస్కులు, ఆఫ్రికన్ అమెరికన్లు, గుండె రక్తనాళాల సమస్యలు వచ్చినవారు ఉన్నట్లు గుర్తించారు.

 

భాగస్వామితో ఉన్నప్పుడు గుండె హఠాత్తుగా ఆగిపోయిన సందర్భాల్లో సీపీఆర్‌ను కేవలం మూడో వంతు కేసుల్లో మాత్రమే నిర్వహించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. కార్డియాక్ అరెస్టు సమస్య తలెత్తినప్పుడు తక్షణం సీపీఆర్ నిర్వహించాల్సి ఉందని, దీనిపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను తమ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని డాక్టర్ సుమీత్ చుగ్ చెప్పారు.

 

గుండె హఠాత్తుగా ఆగిపోతే స్పృహ కోల్పోతారు, శ్వాస ఆగిపోతుంది. సీపీఆర్ ప్రక్రియతో చికిత్స అందించకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. సీపీఆర్‌ను నిర్వహించే విధానాన్ని ఆరేళ్ల వయసువారు కూడా నేర్చుకోగలరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశంలో  తెలిపారు. గుండెపోటు లేదా శస్త్రచికిత్స తర్వాత నాలుగు నుంచి ఆరు వారాలపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: