ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం లేదు అని వచ్చిన ప్రకటనపై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఒక లేఖ రాసాడు. తన పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ లేదా టీజర్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడింది అని తారక్ సదరు లేఖలో పేర్కొన్నాడు. తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు జరపవద్దు అని ఆయన కోరారు. 

 

ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్న అంటూ ఎన్టీఆర్ లేఖ మొదలుపెట్టారు. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నా అంటూ విశ్వాసం వ్యక్తం చేసాడు. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా అని పేర్కొన్నాడు. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం అని విజ్ఞప్తి చేసాడు. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతని పేర్కొన్నాడు. 

 

లాగే, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌లుక్ లేదా టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని నేను అర్థం చేసుకోగలన్న అతను... ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో నాకు తెలుసని పేర్కొన్నాడు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలని... అధికారిక ఆంక్షల వల్ల అది కుదరలేదన్నాడు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకు ఉందని పేర్కొన్నాడు. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుందని... నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ ఎన్టీఆర్‌ అని లేఖలో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: