ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. ప్రత్యర్థి పార్టీలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎక్కడలేని ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతీ విషయాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటు కాంగ్రెస్ అగ్రనేతలు సహా యూపీఏ మిత్ర పక్షాల నాయకులు ఒక్కరినే టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి..? అందులో నిజమెంత..? గెలువలేమనే సంకేతాలు వారికేమైనా అందాయా..? అసలు శాపనార్థాల పర్వం ఎందుకు కొనసాగుతోంది..? కాంగ్రెస్ పార్టీతోపాటు యూపీఏ మిత్రపక్షాలన్నీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు కొందరు యు.పి.ఏ మిత్రపక్షాల నాయకులు పెడుతున్న శాపనార్థాలే ఇందుకు నిదర్శనం. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించి ప్రధాని పదవి చేపడతారన్న భావన కలగక మానదు. యు.పి.ఏ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఓటమిని అంగీకరించే పద్ధతిలో మాట్లాడటం అందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. గుజరాత్‌లో సోనియా మాట్లాడుతూ... నరేంద్ర మోడీ నుండి ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. ఈ మాటలు చూస్తుంటే ఈ దేశ ప్రజలు మోడీకి పట్టం కట్టడం ఖాయం కాబట్టే... ఆమె దేవుడిని కోరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ ఒరవడిని తట్టుకోవటంలో విఫలమవుతున్న సోనియా దేవుడిని ఆశ్రయిస్తే... నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా మాటల్లో నిరాశానిస్ప్రృహ స్పష్టంగా కన్పిస్తున్నాయి. మోడీకి ఓటు వేసే వారంతా సముద్రంలో దూకి చావాలని... శాపనార్థాలు పెడుతున్నారు. రాజకీయ పోరాటంలో ఓటమి అంచుకు వచ్చిపడిన వారు మాత్రమే.. శాపనార్థాలు పెడతారు. ఇప్పుడు సోనియా గాంధి, రాహుల్ గాంధి, చిదంబరం, ఫరూఖ్ అబ్దుల్లా తదితర నాయకుల శాపనార్థాలు వింటుంటే పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో యు.పి.ఏ ఓటమి అంచుకు చేరుకుందనే భావన కలుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యు.పి.ఏ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్పటం వెనక కూడా ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో చాలా ఏళ్ల తరువాత మొదటిసారి ఒక నాయకుడిని పలువురు నాయకులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ ఒక్కరే ప్రధాన ప్రచారకుడుగా రూపాంతరం చెందగా.. ఆయన్ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి వర్గంలోని పలువురు నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. ఒక్కడిని ఎదుర్కొనలేకపోతున్నారు. ఆయన మాటలను సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు. నరేంద్ర మోడీ అంతటా తానై ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఆయన ప్రత్యర్థులు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. దేశంలో ఎక్కడా మోడీ గాలి వీయటం లేదని చెప్పటం ద్వారా వాస్తవానికి ఈ నాయకులే పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గాలి వీస్తోందనే ప్రచారాన్ని పరోక్షంగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ.. లోక్‌సభ ఎన్నికలను మతతత్వంతో ముంచెత్తివేసింది. మోడీ బూచి చూపించటం ద్వారా దేశంలోని దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాలను భయభ్రాంతులను చేయటం ద్వారా వారి ఓట్లను దండుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన ఏ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మతతత్వాన్ని ఇప్పుడు రెచ్చగొడుతున్న స్థాయిలో రెచ్చగొట్టలేదని చెప్పకతప్పదు. మోడీని ఒక బ్రహ్మ రాక్షసుడుగా చిత్రీకరించటం ద్వారా మైనారిటీల ఓట్లు సంపాదించేందుకు కాంగ్రెస్‌తోపాటు యు.పి.ఏ మిత్ర పక్షాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.. నరేంద్ర మోడీ విషయంలో అస్సాంకు చెందిన ఏ.ఐ.యు.డి.ఎఫ్ పార్టీ అధినాయకుడు బదురుద్దీన్ అజ్మల్ చేసిన ప్రకటన లోక్‌సభ ఎన్నికలను ఏ స్థాయిలో మతతత్వంతో పులిమివేశారనేది స్పష్టం చేస్తుంది. బదురుద్దీన్ అజ్మల్ ఒక ప్రకటన చేస్తూ అస్సాంలో బి.జె.పి ఒక్క సీటు గెలుచుకున్నా ‘అల్లా’ ఎవ్వరినీ క్షమించడని ముస్లిం మైనారిటీ ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రకటనలు వారు మోడీని చూసి ఏ స్థాయిలో భయపడుతున్నారనేది వెలుగులోకి తెస్తోంది. వివాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ మోడీని ఏకంగా కుక్కలతో పోల్చారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఈ కుక్కల నుండి కాపాడటం హిందు, ముస్లింల గురుతర బాధ్యత అని చెప్పటం ద్వారా మోడీ పట్ల తనకున్న విద్వేషాన్ని బేనీ ప్రసాద్ వర్మ వెళ్లగక్కారు. ఇమ్రాన్ మసూద్ అనే మరో కాంగ్రెస్ నాయకుడు మరింత ముందుకు వెళ్లి మోడీ ఉత్తర ప్రదేశ్‌ను గుజరాత్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తే.. ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికివేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మోడీని ఏకంగా నరహంతకుడని ముద్ర వేశారు. నరేంద్ర మోడీ వికాస పురుషుడు కాదు.. వినాశ పురుషుడంటూ యు.పి.ఏ నాయకులు తమ ఇష్టానుసారం శాపనార్థాలు పెడుతున్నారు. నరేంద్ర మోడీ వారణాసిలో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్లినప్పుడు.. కాశీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టినప్పటి నుండి కాంగ్రెస్, యు.పి.ఏ మిత్రపక్షాల నాయకుల శాపనార్థాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేశారనడం శుద్ధ అబద్ధమంటూ గాంధీ కుటుంబ సభ్యులంతా ఎదురుదాడికి దిగారు. చిదంబరంతో సహా పలువురు కేంద్ర మంత్రులు గుజరాత్ అభివృద్ది మోడల్‌ను విమర్శించటం ద్వారా.. మోడీని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. అయితే గుజరాత్ మోడల్‌ను విమర్శించటం వలన మోడీ పేరు మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. గుజరాత్ మోడల్‌పై దేశ ప్రజల ఆసక్తి పెరిగింది. గుజరాత్ మోడల్ ఏమిటని అడగటం ప్రారంభించారు. ఇంత మంది సీనియర్ నాయకులు విమర్శించటం వల్ల మోడీ పట్ల ప్రజల్లో క్రేజ్ పెరిగింది తప్ప తగ్గలేదనే చెప్పాలి. చైనా, పాకిస్తాన్‌లకు మోడీ మాత్రమే ధీటైన సమాధానం ఇవ్వగలడు, దేశం పరువు,ప్రతిష్ఠ నిలబెట్టగలుగుతాడనే అభిప్రాయం.. ఓటర్లకు కలుగుతోంది. అయతే గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుండి ఏకంగా ప్రధాని పదవిని చేపట్టాలనుకుంటున్న మోడీలో కూడా... కొంత మార్పు రావలసిన అవసరం ఉంది. దేశానికి నాయకత్వం వహించటం అంటే.. దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు నిజమైన ప్రతినిధిగా వ్యవహరించే స్థాయికి మోడీ ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడే దేశప్రజలకు మోడీనిపై నమ్మకం, భరోసా కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: