హైదరాబాద్ నగరానికి బిర్యానీ డెస్టినేషన్ గా చెప్పుకునే హోటల్ ప్యారడైజ్ ని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. ప్యారడైజ్ హోటల్ లోని పార్శిల్ సెక్షన్ లో జరిగిన అగ్నిప్రమాదం హోటల్ సీజింగ్ కి దారితీసింది. ఎప్పటినుంచో ఫైర్ సేఫ్టీ గురించి హెచ్చరించినా పట్టించుకోని హోటల్ యాజమాన్యానికి బల్దియా ఝలక్ ఇచ్చింది. దేశవిదేశాల్లో ఫేమస్ అని చెప్పుకునే హోటల్ యాజమాన్యం ఈ పరిణామంతో ఖంగుతినింది. హైదరాబాద్ నగరాన్ని.. బిర్యానీని విడిగా చూడలేము. అందులోనూ ప్యారడైజ్ బిర్యానీ గురించి వినని.. తినని బిర్యానీ ప్రేమికులు లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీరోజు వేలమంది ఈ బిర్యానీని టేస్ట్ చేస్తుంటారు. దీనికి తోడు వందలాదిమంది పార్శిల్ తీసుకుని వెళుతుంటారు. అలాంటి ప్రదేశంలో యాజమాన్యం ఎంత అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆదివారం రోజున పార్శిల్ కౌంటర్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో పరిస్థితి అర్థం కాని వినియోగదారులు పరుగులు తీశారు. ప్యారడైజ్ హోటల్ లోని పార్శిల్ కౌంటర్ లో తందూర్ చిమ్నీలో పేరుకుపోయిన నూనె అంటుకోవడంతో పొగలు వచ్చాయని నిర్థారించుకున్నారు. అయితే హోటల్ యాజమాన్యంతో పాటు పక్కనే ఉన్న ఫైర్ ఇంజన్ లు అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ , అధికారులు.. ప్యారడైజ్ హోటల్ లోని పరిస్థితులు చూసి ఆశ్యర్యపోయారు. అవసరమైన చోట కాకుండా.. కేవలం అలంకరణ ప్రాయంగా ఉండేలా ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చారు. అవికూడా పనిచేసే స్థితిలో లేవు. దీంతో హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించిన జీహెచ్ఎంసీ అధికారులు ప్యారడైజ్ హోటల్ ను సీజ్ చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ హడావిడిగా ఏదో ఒక చర్య తీసుకుని.. తర్వాత శీతకన్ను వేయడం మామూలు అయిపోయిందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిబంధనలను తుంగలో తొక్కిన ఎన్నో హోటళ్లున్నాయని వాటిన్నింటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: