
కొత్త ఏడాది సందర్భంగా పట్నాలో లాలూ ఇంటికి పలువురు ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో స్వామి శ్రద్ధానంద్ మహారాజ్ కూడా వచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ భవిష్యత్‌లో భారత ప్రధానమంత్రి కానున్నారని భవిష్యవాణి చెప్పారు. లాలూ ఇంటికి తరచూ వచ్చే శ్రద్దానంద మహరాజ్ భవిష్యవాణి చెబుతారు.. కాశీలో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లోని భఖ్తియాపూర్‌లో కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. రబ్రీదేవి ఇంటికి వచ్చిన బాబా ప్రసాదంతో పాటు భగవద్గీతను ఆమెకు బహుకరించారు. ఆ ప్రసాదాన్ని రబ్రీ.. రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త లాలూకు కూడా పంపించారు. రబ్రీని కలసిన శ్రద్ధానంద మహరాజ్.. మీ కుమారుడు తేజస్వీ యాదవ్ ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తేజస్వికి ప్రస్తుతం కొన్ని ఆటంకాలున్నాయని, అవి త్వరలోనే తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. లాలూ కుమారులు దేశానికి నేతృత్వం వహిస్తారని వివరించారు. కొంతకాలం కిందట అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారని తమ గురువు చెప్పారని, అది నిజమయ్యిందని ఆయన పేర్కొన్నారు.