భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట గుజరాత్ రాష్ట్రం. వరుసగా ఆరుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన గుజరాతీల కోసం కమలం పార్టీ నేతలు ఎంత చేసినా తక్కువే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచ స్థాయి నేతగా ఎదిగేందుకు బాటలు వేసింది గుజరాతీలే. ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా... అవేవీ లెక్క చేయకుండా వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో... ఆయన జాతీయ స్థాయి నేతగా గుర్తింపు పొందారు. అదే ఊపుతో... 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ అనే మాట కాస్తా... నమో అంటూ బీజేపీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. సక్సెస్ సాధించారు. వరుసగా రెండు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే... అందులో గుజరాతీల సాయం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న నేతలు మోదీ, అమిత్ షా ద్వయం గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే. ఈ జోడి ఇప్పటికే దేశ రాజకీయాలను శాసిస్తోంది.

వచ్చే ఏడాది జరిగే గుజరాజ్ ఎన్నికలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన రాష్ట్రంలో మరో విజయం కూడా సాధించాలనేది నరేంద్ర మోదీ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది మోదీ, అమిత్ షా ద్వయం. కేంద్రం తరఫున సాధ్యమైనంత ఎక్కువగా నిధులను కేటాయిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌ నగరంలో నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఏకంగా నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించారు. ఆయనతో గుజరాత్‌లో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు తాజాగా 870 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాప్లెంక్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఎతైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్‌లో ఉంది. ముంబై-ఢిల్లీ బుల్లెట్ రైలు మార్గాన్ని కూడా గుజరాత్ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా రివర్ బే ఎయిర్ పోర్టులను కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేశారు. ఇంత చేస్తున్నందున గుజరాతీలు తమకు మరోసారి అధికారం ఇస్తారనేది బీజేపీ నేతల ధీమా.


మరింత సమాచారం తెలుసుకోండి: