న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రతో అమరావతి ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసింది. 685 రోజులు అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు రాజధాని కోసం ఉద్యమిస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమరావతి ఉద్యమం కేవలం ఆ ప్రాంతానికి పరిమితమైందని, దానికి రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల నుంచి స్పందన లేకుండా పోతోందనీ, అందుకే అమరావతి ఉద్యమ సెగ ప్రభుత్వానికి తాకడం లేదన్న వాదనలు, అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టడానికి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వాసుల సంఘీభావం, సపోర్టు ఉండేలా చేసుకునేందుకు అమరావతి ఉద్యమ ఐక్య కార్యాచరణ సమితి ఇవాళ్టి నుంచి రైతుల మహాపాదయాత్రను మొదలుపెట్టింది. ఇందుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు.. రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు అమరావతి ఉద్యమం విజయవంతం కావాలని, రైతుల మహా పాదయాత్రతోనైనా వైసీపీ సర్కారుకు కనువిప్పు కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు, ప్రకటనల రూపంలో సంఘీభావం తెలుపుతున్నారు.

అయితే అమరావతి ఉద్యమంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం మౌనముద్ర దాల్చడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం విశాఖలో జరిగిన సభలో కూడా ఆయన.. మరుసటి రోజు నుంచే ప్రారంభమయ్యే అమరావతి రైతుల మహా పాదయాత్ర గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ కాకుండా... దాన్ని ప్రభుత్వ రంగం కర్మాగారంగానే కొనసాగించాలన్న డిమాండుతో 262 రోజులుగా అక్కడి కార్మిక సంఘాలు సాగిస్తున్న దీక్షకు సంఘీభావంగా పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. విశాఖ ఉక్కు భిక్ష కాదు.. ఆంధ్రుల హక్కు అని నినదించారు. అయితే తన ప్రసంగంలో ఎంతసేపటికీ వైసీపీ ప్రభుత్వాన్నే టార్గెట్‌గా చేసుకుని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు తప్ప.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేస్తున్న కేంద్ర సర్కారుపై మాత్రం ఏమీ మాట్లాడకపోవడం రాజకీయ వర్గాలను, పరిశీలకులను విస్మయానికి గురిచేసింది.

ఇదిలావుంటే, విశాఖ ఉక్కు ఉద్యమంలో 262 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల దీక్షలకు మద్దతు పలుకుతూ విశాఖలో రోడ్‌ షో, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌.. మరి 685 రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర గురించి మాట మాత్రమైనా ఎందుక మాట్లాడటం లేదన్న చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాష్ట్ర ప్రజల మద్దతు కొరవడిందన్న భావనలో... ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడం మేలని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. మరి అదే పరిస్థితి ఎదుర్కొంటున్న అమరావతి ఉద్యమం మాట పవన్‌ నోట ఎందుకు రాలేదు? విశాఖలో సభలో ప్రసంగించిన ఆయన.. మరుసటి రోజు నుంచే మొదలయ్యే అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రస్తావన ఎందుకు లేవనెత్తలేదు? ఉద్యమం, వేదిక వేర్వేరు కాబట్టి ఆ అంశం గురించి మాట్లాడటం ఎందుకులే అనుకున్నారా? లేక ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: