ఇక డ్రగ్స్ రవాణాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిస్థానంలో ఉందని ఎన్సీబీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో డ్రగ్స్ ని ఈ రేంజ్ లో పండించి రవాణా చేస్తున్నారా అని ఆ నివేదిక ఇచ్చిన షాక్ నుంచి ఏపీ ప్రజలు తేరుకోకముందే...మరో షాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఏపీకి చెందిన మహిళ దగ్గర నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను బెంగుళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.ఏపీలోని అరకు ఏజెన్సీ ప్రాంతాలలో డ్రగ్స్ పండించి..గుట్టుచప్పుడు కాకుండా బెంగుళూరు ఐటీ హబ్ లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ రాకెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు మహిళలతో పాటు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కేంద్రంగా డ్రగ్స్ ధందా నిర్వహిస్తూ కింగ్ పిన్ గా చలామణి అవుతున్న వైజాగ్ కోటేశ్వర్ రావ్ ఈ డ్రగ్ రాకెట్ కు సూత్రధారి అని తెలుస్తోంది.


బెంగుళూరు సిటీ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు మహిళల్లో వైజాగ్ కోటేశ్వర్ రావ్ భార్య పాంగి పూర్ణమ్మ కూడా ఉన్నారు. ఆమెతోపాటు కుడేరి పుష్పా గుడి విజయా దేవి నైజీరియాకు జాన్ అలియాస్ డేవిడ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రూ.7.80 కోట్ల విలువైన 8 కేజీల హ్యాష్ ఆయిల్ ను 10 కేజీల డ్రగ్స్ ని 1 కేజీ ఎండీఎంఏ క్రిస్టల్ ను పోలీసులు సీజ్ చేశారు.గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల గెటప్ లో వెళ్లిన పోలీసులు సినీ ఫక్కీలో డ్రగ్స్ అమ్ముతున్న మహిళలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ సమయంలో కోటేశ్వర్ రావ్ తృటిలో తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఏపీలోని అరకు చింతపల్లి అటవీ ప్రాంతంలో కోటేశ్వర్ రావ్ గ్యాంగ్ భారీ స్థాయిలో డ్రగ్ పండిస్తున్నారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.అరకు చింతపల్లిలోనే గంజాయితో హ్యాష్ ఆయిల్ తయారు చేసి దానిని బెంగళూరులో డ్రగ్స్ డీలర్స్ కు అమ్ముతున్నారని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: